రివ్యూ : పద్మావత్
చిత్రం : పద్మావత్ (2017)
నటీనటులు : షాహిద్ కపూర్, రణ్ వీర్ సింగ్, దీపికా పడుకోనె
సంగీతం : సంజయ్ లీలా భన్సాలీ
దర్శకత్వం : సంజయ్ లీలా భన్సాలీ
నిర్మాణం : ఎస్.ఎల్.బి.ఫిలిమ్స్, వియాకామ్ 18 మోషన్ పిక్చర్స్
రిలీజ్ డేటు : 25 జనవరి, 2018.
రేటింగ్ : 3.75/5
పద్మావత్.. అద్భుత దృశ్యకావ్యం
వివాదాలు, అడ్డంకులని దాటుకొని భన్సాలీ “పద్మావత్” ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. మహారాణి పద్మావతి చారిత్రక కథతో తెరకెక్కిన చిత్రమిది. దీపికాపడుకోణే, రణ్ వీర్ సింగ్, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలలో నటించారు. రిలీజ్ ముందే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొన్న ‘పద్మావత్’ ఎలా ఉంది. చరిత్రను ఏమైనా వక్రీకరించారా ? పద్మావతి ఏ మేరకు ప్రేక్షకులని ఆకట్టుకొంది తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
చరిత్రపై అవగాహన ఉన్నవారికి అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి తెలిసిన విషయమే. ఆయనో క్రూరుడు. స్త్రీలోలుడు. పెద్ద నాన్న జలాలుద్దీన్ ఖిల్జీని చంపి ఢిల్లీ సింహసనాన్ని అధిష్టిస్తాడు. ప్రపంచంలో అందమైనవీ, అద్భుతమైనవన్నీ తన దగ్గరే ఉండాలని ఆశ పడతాడు. అందుకోసం ఎంతటి దుర్మార్గమైనా చేసేస్తాడు. ఈ ప్రపంచంలోనే అత్యంత అందగత్తె `పద్మావతి` గురించి ఖిల్జీకి తెలుస్తుంది. ఆమె అప్పటికి వివాహిత. మేవార్ రాజైన రావల్ రతన్‌సింగ్ (షాహిద్‌కపూర్) అర్థాంగి. ఎట్టిపరిస్థితుల్లోనూ పద్మావతిని దక్కించుకోవాలని కుట్రపన్నుతాడు ఖిల్జీ. రాజపుత్‌లపై యుద్ధం ప్రకటిస్తాడు. మరి ఖిల్జీ పద్మావతిని దక్కించుకున్నాడా? లేదంటే పద్మావతి వీరత్వం ముందు తలవంచాడా ??” అన్నది మిగితా కథ.
ఎవరెలా చేశారంటే ?
దర్శకుడు భన్సాలీ 1540లో సూఫీ కవి మాలిక్ మహ్మద్ అవధి భాషలో రాసిన పద్మావత్ అనే పద్యకావ్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించాడు. ముఖ్యంగా పద్మావతి త్యాగాన్ని హైలైట్ చేస్తూ కథని రాసుకొన్నాడు. డ్రామాను నడిపించడమే భన్సాలీ ప్రధాన బలం. పద్మావత్ విషయంలోనూ డ్రామాను అద్భుతంగా నడిపించారు. చారిత్రాత్మక సినిమాలో యుద్ధాలని ఓ రేంజ్ లో చూపించొచ్చు. భన్సాలీ మాత్రం డ్రామ నడిపేందుకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అందులో సక్సెస్ అయ్యారు.
ఖిల్జీ పాత్రలో నటించిన రణ్ వీర్ సింగ్ నటన సినిమాకే హైలైట్. క్రూరత్వం గల ఖిల్జీ పాత్రలో అద్భుతంగా నటించారు. ఆ పాత్రలో రన్ వీర్ ని తప్ప మరొకరిని ఊహించలేని రేంజ్ లో నటించి ఆకట్టుకొన్నాడు. రణ్ వీర్ తర్వాత దీపికా పదుకొనె నటన సూపర్భ్. ఆమె కళ్లతో నటించి ఆకట్టుకొన్న సన్నివేశాలున్నాయి. క్లైమాక్స్ లో 800 మంది రాజపుత్ర కన్యలతో అల్లావుద్దీన్ ఖిల్జీపై యుద్దానికి బయలుదేరే సన్నివేశంలో ఆమె నటన మాహాద్భుతం. రాజా రతన్‌సింగ్ పాత్రలో షాహిద్‌కపూర్ తనదైన శైలిలో అకట్టుకున్నాడు.
సాంకేతికంగా :
చరిత్రను వక్రీకరించకుండా, ఎవరి మనోభావాలను దెబ్బతీయకుండా ఉండేలా కథ, కథనాల్ని తయారుచేసుకున్నాడు భన్సాలీ. ప్రతి ఫ్రేమ్‌ను దృశ్య కావ్యంగా ఆవిష్కరించాడు. కాస్ట్యూమ్స్ బాగున్నాయి. సంచిత్ బల్హార బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. వివాదాల నేపథ్యంలో కొన్న సీన్స్ కత్తెర పెట్టడం కారణంగా సినిమా జంప్ చేసినట్టు కనబడుతోంది. సెట్స్ తెరపై అద్భుతంగా కనిపించాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి.