మత్స్యావతారంలో యాదాద్రి నారసింహుడు
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మొదటి రోజు స్వస్తి వచాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు, రెండవ రోజు స్వామివారికి ధ్వజారోహణం నిర్వహించారు. మూడవరోజు నుంచి వివిధ అలంకారాలలో స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవరోజైన సోమవారం మత్స్యావతారంలో భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. ప్రభాత సేవల అనంతరం స్వామివారిని మత్య్సావతార అలంకరణలో దర్శనమిచ్చారని, సోమకాసురుడనే రాక్షసుడు వేదాలను అపహరించినపుడు వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించారని, అజ్ఞానాంధకారాలను తొలగించడమే మత్స్యావతారంలోని అంతరార్థమని పండితులు చెబుతుంటారు. మత్స్యావతారంలో కొలువైన ఆ యాదాద్రి వాసుడిని దర్శించుకుని భక్తులు పరవశించి పోయారు. రాత్రి 9గంటలకు శేషవాహనం పై స్వామివారు కొలువుదీరనున్నారు.