నేతన్నకు రూ. లక్ష రుణమాఫీ

చేనేత కార్మికులకు తీపి కబురు. నేతన్నలకు రుణమాఫీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ. లక్ష లోపు రుణాలు తీసుకున్న వారికి మాత్రమే రుణమాఫీ వర్తించనుంది. రూ. లక్ష లోపు రుణంపై అసలు, వడ్డీ కలిపి ప్రభుత్వమే చెల్లిస్తుంది. 2014, జనవరి నుంచి 2017, మార్చి 31 మధ్యకాలంలో లక్షలోపు రుణాలు తీసుకున్న
నేతన్నలకు ఈ మాఫీ వర్తించనుంది.

రూ. లక్షకు పైగా రుణం తీసుకొంటే గనుక ఆ మొత్తాన్ని చేనేత కార్మికుడే భరించాల్సి ఉంటుంది. తాజా నేతన్నల రుణమాఫీ నిర్ణయంతో ద్వారా 4,400 మంది లబ్ధి పొందనున్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై రూ.20 కోట్ల మేరకు అదనపు భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు. మొత్తంగా కేసీఆర్ ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం పట్ల నేతలన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గత సాధారణ ఎన్నికలకు ముందు టీఆర్ ఎస్ రైతు రుణమాఫీ హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీని విడతల వారీగా మంజూరు చేసింది. ఇప్పుడు సాధారణ ఎన్నికల ముందు చేనేత రుణమాఫీపై కేసీఆర్ ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం ఆ పార్టీకి మళ్లీ అధికారం తెచ్చిపెడుతుందేమో చూడాలి.