జగన్’ను ఇరకాటంలో పడేసిన చంద్రబాబు…!
ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ సీంఎం చంద్రంబాబు కేంద్రంతో రాజీ పడ్డారని వైసీపీ అధినేత, విపక్షనేత జగన్ ప్రచారం చేస్తూ వచ్చారు. అందరం రాజీనామా చేద్దాం అంటూ టీడీపీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు కూడా. వచ్చే ఎన్నికల్లో బీజేపీ టీడీపీని వీడి వైసీపీకి చేయందిస్తోందనే సంకేతాలు ఉన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆచితూచి అడుగులు వేశారు. ఎక్కడ తేడా వచ్చినా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయనే ఉద్దేశంతో మొదటగా బీజేపీ తీరును తామువ్యతిరేకిస్తున్నట్లుగా పార్లమెంటు సాక్షిగా తమ ఎంపీలతో నిరసన చేయించి బీజేపీకి సంకేతాలు పంపారు చంద్రబాబు.
కేంద్రమంత్రి అరుణ్ జైట్టీ ప్రకటనతో హోదా ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. సరిగ్గా ఈ సంఘటననే తమకు అనుకూలంగా మార్చుకుని విపక్ష పార్టీలను ఇరకాటంలో పడేశారు చంద్రబాబు. బీజేపీతో పొత్తు పెట్టుకుందామనే ఆలోచనలో ఉన్న వైసీపికి, హోదా విషయంలో ఏపీకి అన్యాయం చేస్తోన్న బీజేపీని ఒకే మాటతో ఇరకాటంలో పడేశారు చంద్రబాబు. ఇప్పటికే మైత్రీ బంధాన్ని తెగతెంపులు చేసుకుంటే రాజీనామా చేయండని బీజేపీ ఎమ్మెల్యేలకు జాతీయ నాయకత్వం నుంచి సంకేతాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో మంత్రులుగా కొనసాగుతున్న తమ ఎంపీలు రాజీనామా చేస్తారంటూ చంద్రబాబు ప్రకటించడంతో బీజేపీ కంటే ముందే టీడీపీ తామే మైత్రీ బంధాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పకనే చెప్పినట్లైంది.
కేంద్ర మంత్రుల రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో అటు బీజేపీని , ఇటు జగన్ ను ఇరకాటంలో పడేసినట్లైంది. హోదా ఇవ్వలేమని స్పష్టం చేసినందునే బీజేపీతో తెగతెంపులు చేసుకోవడంతో పాటు మంత్రులను రాజీనామా చేయించడం వల్ల ప్రజల్లో టీడీపీపై పాజిటివ్ మెసేజ్ వెళ్లేలా చేశారు చంద్రబాబు. పాదయాత్రతో ప్రజల్లోకి వెళుతున్న వైసీపీ అధినేత జగన్ కూడా ఇరకాటంలో పడినట్లైంది. ఎంపీలతో రాజీనామా చేయిస్తానని ప్రకటించిన జగన్ ఇప్పుడేం చేస్తారా అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. ఒకవేళ వైసీపీ ఎంపీలను రాజీనామా చేయించకపోతే జగన్ బీజేపీకి అనుకూలమనే భావన ప్రజల్లో కలుగుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
సరైన సమయంలో, సరైన సందర్భంలో ఒకే ఒక మాటతో అటు బీజేపీ, ఇటు రాష్ట్రంలోని విపక్ష నేతలను ఇరకాటంలో పడేలా చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లోకి ఎలాంటి తప్పుడు సంకేతాలు వెళ్లకుండా ధైర్యంగా మళ్లీ ప్రజల్లోకి వెళ్లేలా చంద్రబాబు చక్రం తిప్పడం ఆయన రాజకీయ చతురతకు అద్దంపడుతోంది..