ఒంట‌రి పోరుపై బీజేపీ ధీమా అదేనా..?

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే తెలుగు రాష్ట్రల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీది ఒంట‌రి పోరే అని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ప్రాంతీయ పార్టీల‌తో పోలిస్తే క్షేత్ర స్థాయిలో బీజేపీకి అంత‌గా బ‌లం లేదు. జ‌రుగుతున్న ప‌రిణామాలు, కేంద్ర పెద్ద‌ల ప్ర‌క‌ట‌న‌లు చూస్తోంటే ప్ర‌జ‌ల్లో ఆ పార్టీపై , కేంద్ర ప్ర‌భుత్వంపై పెద్ద‌గా స‌ద‌భిప్రాయం కూడా లేదు. ముందు నుంచి 2019లో తెలంగాణ‌లో బీజేపీ ఒంట‌రి పోరే అని చెబుతూ వ‌స్తున్నా , ఏపీలో మాత్రం బీజేపీ పొత్తుల‌తోనేపోటీ చేస్తుంద‌ని భావించారు అంతా.

తెలంగాణ‌లో బీజేపీపై క‌క్ష పెంచుకునేంత పెద్ద అంశాలేవీ లేక‌పోయినా, టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ ల‌తో పోలిస్తే బీజేపీని అభిమానించేవారు, బీజేపీకి ఉన్న ఓటు బ్యాంకు కాస్త త‌క్కువే. అయితే ఏపీలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది ఆ పార్టీ ప‌రిస్థితి. టీడీపీతో మైత్రీ బంధం తెగతెంపులు చేసుకున్నా , క‌నీసం జ‌గ‌న్ తో అయినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తు పెట్టుకుంటుంద‌ని, జ‌గ‌న్ పై కేంద్రం వైఖ‌రి కూడా అవే సంకేతాలు ఇచ్చింద‌నే టాక్ వినిపించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఏపీలో అస‌లు ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ప‌రిస్థితి లేకుండా ఉంది.

ఇటు ఇన్నాళ్లూ మిత్ర ప‌క్షంగా ఉన్న టీడీపీ, అటు చేయిక‌లుపుదామ‌నుకున్న వైసీపీతో వ‌చ్చే ఎన్నిక‌ల్లోక‌లిసే ప‌రిస్థితి లేకుండా పోయింది. పైగా ప్ర‌జ‌లు బీజేపీని దోషిగా చూసే అవ‌కాశం కూడా ఉంది. రాష్ట్రన్ని విడ‌దీసి కాంగ్రెస్ ను మ‌ట్టిక‌రిపించిన ఏపీ ప్ర‌జ‌లు , త‌మ‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా అన్యాయం చేసిన బీజేపీకి కూడా అదే ప‌రిస్థితి తీసుకు వ‌స్తార‌ని ఇప్ప‌టికే రాజ‌కీయ విశ్లేష‌కులు అంచానా వేశారు. ఈ ప‌రిస్థితి అంతా బీజేపీ అధినేత‌లు ముందుగానే ఊహించే ఉంటారు. అయినా కేంద్ర ప్ర‌భుత్వం మొండి వైఖ‌రితో ముందుకు వెళ్ల‌డం వెన‌క ఉన్న ధీమా ఏంట‌నేదానిపై స‌ర్వ‌త్రా చ‌ర్చ కొనసాగుతోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇటు తెలంగాణ‌లో, అటు ఏపీలో ఒంట‌రిగానే పోటీ చేయాల‌ని బీజేపీ భావిస్తోంది. త్రిపుర ఎన్నిక‌ల్లో ఫాలో అయిన ఫార్ములానే తెలుగు రాష్ట్రల్లో వ‌ర్క‌వుట్ చేయాల‌ని భావిస్తున్నార‌ట బీజేపీ పెద్ద‌లు. బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థులున్న‌చోట వీలైనంత ఎక్కువ‌మందిని పోటీకి దింపి ఓట్లు చీల్చ‌డం ద్వారా త‌మ అభ్య‌ర్థుల‌ను గెలుపించుకోవ‌చ్చ‌ని భావిస్తున్నార‌ట‌. ఎన్నిక‌ల త‌రువాత ఫ‌లితాల ఆధారంగా అవ‌స‌రమైతే టీడీపీ, కాంగ్రేసేత‌ర పార్టీల‌తో పొత్తుకు వెన‌కాడ‌వ‌ద్ద‌ని అనుకుంటున్నార‌ట‌. యూపీ,త్రిపుర ఫార్ములా తెలుగు రాష్ట్రల్లో ఫ‌లిస్తుందో లేదో చూడాలి మ‌రి..