అవ‌స‌ర‌మైతే ఆ రోజు నిమిషం నిబంధ‌న స‌డ‌లిస్తాం..! : క‌డియం

తెలంగాణ విద్యార్థుల భవిష్యత్ ను, ఆ రోజు జరిగే ఇంటర్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 13న తెలంగాణలో ఎమ్మార్పీఎస్ తలపెట్టిన బంద్ ను వాయిదా వేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కోరారు. ఈ బంద్ కు సహకరించే రాజకీయ పార్టీలు కూడా బంద్ వాయిదాకు సహకరించాలన్నారు. ఈ నెల 13వ తేదీన ఇంటర్ మొదటి సంవత్సరం కెమెస్ట్రీ పరీక్ష తప్పకుండా జరుగుతుందని విద్యార్థులు మంచిగా ప్రిపేర్ కావాలని, పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు.

ఎస్సీల వర్గీకరణ కోసం విద్యార్థులను ఇబ్బంది పెడితే…నష్టపోయేది తెలంగాణ విద్యార్థులేనని ఆయన అన్నారు. రాజకీయాలను, పరీక్షలకు ముడిపెట్టవద్దని, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేయవద్దని కోరారు. 13వ తేదీన ఇంటర్ మొదటి సంవత్సరం కెమెస్ట్రీ పరీక్ష ఉందని, దీనికి లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారని చెప్పారు. ఈ పరీక్షను బంద్ నేపథ్యంలో వాయిదావేద్దామని ఆలోచించామని, అయితే ఏప్రిల్ 15వతేదీలోపు ఇంటర్ పరీక్షల ఫలితాలు ప్రకటించాల్సి ఉందన్నారు. లేనిపక్షంలో విద్యార్థులు జాతీయ పరీక్షలు రాసే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. పరీక్షల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఒత్తిడికి లోనవుతుంటారని, ఈ సమయంలో బంద్ కు పిలుపునివ్వడం సమంజసం కాదని ఆయ‌న అభిప్రాయపడ్డారు.

విద్యార్థుల పరీక్షల నేపథ్యంలో బంద్ వాయిదా కోసం కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బిజెపి లక్ష్మణ్ , ఇతర నేతలతో కూడా తాను మాట్లాడినట్లు చెప్పారు. పార్టీలో చర్చించుకుని నిర్ణయం తీసుకుంటామని ఆయా పార్టీల నేతలు చెప్పారన్నారు. ఈ నెల 13న పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, పోలీసులు, ఆర్టీసీ అధికారులతో మాట్లాడినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. విద్యార్థులు ఎలాంటి అనుమానాలు, అపోహలకు లోను కాకుండా, బంద్ వార్తలను పట్టించుకోకుండా పరీక్షలకు ప్రిపేర్ కావాలని సూచించారు. విద్యార్థులు ఎవరైనా పరీక్షలకు హాజరు కాకుండా నష్టపోతే దానికి ఎమ్మార్పీఎస్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని బంద్ వాయిదావేసి అందరూ సహకరించాలని కోరారు.

బంద్ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలకు విధించిన ఒక నిమిషం నిబంధనను సడలించి పరీక్ష రాసే వెసులుబాటు కల్పిస్తామని, తప్పకుండా పరీక్ష నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు ఆందోళనకు గురి కాకుండా పరీక్షలు రాయాలన్నారు.