రచ్చకెక్కిన సీఎం కేసీఆర్.. !!
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ పూర్తిస్థాయి రాజకీయపార్టీగా దూసుకుపోతోంది. ఉద్యమ సమయంలో సబ్బండ వర్గాలను ఏకం చేయడంలో, జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమ సెగను ఢిల్లీకి తగిలేలా చేసిన ఘనత కేసీఆర్ దే. పన్నెండేళ్ల ఉద్యమ ప్రస్థానం తరువాత రాష్ట్రం సాధించి అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రంను సుసాద్యం చేసి చూపారు. ఉద్యమ పార్టీగా పుట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు తరువాత పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా అవతరించామని చెబుతూనే విపక్షాలను దెబ్బతీసి, పార్టీని మరింత బలోపేతం చేయడంలోనూ తన చాణక్య నీతికి పదును పెట్టారు సీఎం కేసీఆర్.
ఎప్పటికప్పుడు వ్యూహ ప్రతివ్యూహాలతో విపక్షాలను బలహీనపరచడంలోనూ విజయవంతమయ్యారు గులాబీ బాస్. తాజాగా దేశరాజకీయాలవైపు అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్లి చక్రం తిప్పాలని భావిస్తున్నారు ఆయన. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు రావాలని, కాంగ్రెస్, బీజేపీల పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి ఫెడరల్ ఫ్రంట్ ప్రక్రియను కూడా ఇప్పటికే ప్రారంభించారు ఆయన. మొదటగా మమతా బెనర్జీ, ఆ తరువాత కన్నడ నాట అడుగుపెట్టి కరుణానిధి, స్టాలిన్ లతో ఫ్రంట్ పై చర్చలు జరిపారు. మరి కొద్దిరోజుల్లో ఈ ఫ్రంట్ ఏర్పాటు అంశాన్ని మరింత స్పీడ్ అప్ చేయాలని ఆయన భావిస్తున్నారట కూడా.
గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన అనుభవమున్న కేసీఆర్, వ్యూహాత్మకంగా ముందుకు వెళుతూ తనదైన శైలిలో అందరినీ ఏకతాటిపైకి తీసుకురావలని ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటులో ఏవిధంగానైతే అందరినీ ఏకం చేసి తెలంగాణ ఏర్పాటు చేయక తప్పని పరిస్థితి తీసుకువచ్చారో అలాగే ఫ్రంట్ ఏర్పాటు చేసి దేశ రాజకీయాల్లోనూ తనముద్ర వేసుకోవాలని భావిస్తున్నారాయన. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే ఫార్ములాను ఆయన చక్కగా ఫాలో అవుతున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను తన అధీనంలో ఉండేలా చేసుకున్న ఆయన ఇప్పుడు దేశ రాజకీయాలవైపు దృష్టి సారించారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో, కేసీఆర్ దేశ్ కీ నేతా అవుతారో లేదో చూడాలి.