అసైన్డ్ భూములకూ రైతు బంధు! : మంత్రి ఈటెల
దేశంలోనే మొదటిసారిగా ఈ నెల 10 న ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు బంధు, రైతు లక్ష్మీ కార్యక్రమాన్ని కరీంనగర్ నుంచి ప్రారంభించబోతున్నారు. తెలంగాణ ఉద్యమం మొదలైనపుడు కరీంనగర్ లోనే తొలి సింహగర్జన నుండి ప్రారంభమైందని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారిగా జిల్లాల పర్యటన కూడా కరీంనగర్ గడ్డ నుంచే మొదలైందని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుబంధు విశేషాలను వివరించారు. రైతులకు 17వేల రూపాయల కోట్ల రుణమాఫీ చేసినది ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని, మొత్తం రాష్ట్ర రైతాంగానికి 12 వేల రూపాయల కోట్ల పెట్టుబడి అందించి రైతుకు భరోసా అందించే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని ఆయన చెప్పారు.
నూటికి నూరు శాతం భూ ప్రక్షాళన చేసి భూమి కలిగిన ప్రతి రైతుకి పాస్ పుస్తకాలు అందించబోతున్నామన్నారు. అసైన్డ్ భూములకు కూడా రైతు బంధు పథకం వర్తిస్తుందని చెప్పారు. హుజూరాబాద్ లో తలపెట్టిన సభకు లక్షమంది రైతులు హాజరవుతారని ఆయన తెలిపారు.