ఎంపీగా పోటీపై మంత్రి హరీష్ అంతరంగం అదేనా…?
మంత్రిగా ఉన్నా నిత్యం ప్రజల్లో ఉంటూ, నియోజవర్గంలో తిరుగుతూ, దూకుడుగా వ్యవహరిస్తూ ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టిస్తున్నారు మంత్రి హరీష్ రావు. విపక్షాల విమర్శలను తిప్పకొడుతూ తానేంటో చేతల్లో చూపే డైనమిక్ లీడర్ గా ఎంతో పేరుతెచ్చుకున్న హరీష్ రాజకీయంపై గత కొంతకాలంగా అనేక రకాల ప్రచారం జరుగుతోంది. ఒక రకంగా ఆయన లోప్రొఫైల్ మెయింటెన్ చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ తరువాత ఆస్థాయిలో తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నాయకుడు మంత్రి హరీష్. సీఎం కేసీఆర్ 2019లో దేశరాజకీయాల్లోకి వెళుతున్న నేపథ్యంలో మంత్రి హరీష్ కూడా పార్లమెంటు స్థాయిలో పోటీ చేయవచ్చనే ప్రచారం ఈ మధ్య ఎక్కువైంది. ఫెడరల్ ఫ్రంట్ విషయంలో ఇప్పటికే స్పీడ్ పెంచిన సీఎం కేసీఆర్ ఎన్నికల్లోగా ఫ్రంట్ కు ఒక రూపు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో హరీష్ రావు కూడా వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేస్తారని చాలామంది భావిస్తున్నారు.
ఈ ప్రచారంపై ఇంతకాలం ఎలాంటి వ్యాఖ్యలను చేయకపోవడం, కనీసం స్పందిచడం కూడా చేయని హరీష్ ఈ మధ్య ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అంతరంగాన్ని ఒక్కమాటలో ఆవిష్కరించారు. ఎంపీగా పోటీచేస్తారనేది ఒక ప్రచారం మాత్రమేనని, అందులో ఎలాంటి వాస్తవం లేదని, ఎంపీగా పోటీచేయాలా, లేక ఎమ్మెల్యేగానా అనేది పార్టీ, తమ ముఖ్యమంత్రి నిర్ణయిస్తారని చెప్పేశారు. అంటే ఎంపీగా పోటీచేసే ఆలోచన తనకు ఏమాత్రం లేదని పరోక్షంగా ఒక్కమాటలో చెప్పకనే చెప్పారు మంత్రి హరీష్ రావు. అదేవిధంగా పార్టీ నిర్ణయానికి లోబడి ఉంటానని కూడా చెప్పుకొచ్చారు ఆయన.
దీంతో ఇంతకాలంగా హరీష్ రావు రాజకీయ భవిష్యత్ పై జరుగుతున్న ప్రచారానికి కాస్త బ్రేక్ పడినట్లయింది. ఎంపీగా పోటీచేయడంపై ఆయన అంతరంగం కూడా అదేనని ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారట. చూడాలిమరి 2019లో హరీష్ రాజకీయ భవిష్యత్ పై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..