రవితేజ పవర్’కు నాగ‌శౌర్య‌ తట్టుకోగలడా ?

రవితేజ-నాగ‌శౌర్య‌ల గొడవ ఇండస్ట్రీలో హాట్ టాపిక్’గా మారింది. వీరిద్దరు ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్ద యుద్దానికి దిగనున్నారు. రవితేజ ‘నేల టికెట్’, నాగ‌శౌర్య‌ ‘అమ్మమ్మగారిల్లు’ ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. దీంతో రవితేజ పవర్’కు కుర్రహీరో నాగ‌శౌర్య‌ తట్టుకోగలడా ? చర్చ మొదలైంది.

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ ‘నేల టికెట్’ తెరకెక్కింది. సోగ్గాడే చిన్ని నాయన, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో తనేంటో నిరూపించుకొన్నాడు కళ్యాణ్. ‘చుట్టూ జనం మధ్యలో మనం’ అనే కాన్సెప్ట్ తో నేల టికెట్ ని తెరకెక్కించారు. రవితేజ సరసన మాళవిక శర్మ జతకట్టనుంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన పాటలు, టీజర్, ట్రైలర్, వీడియో సాంగ్ ప్రోమోస్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

నాగ‌శౌర్య‌ – బేబి షామిలి జంట‌గా ‘అమ్మమ్మగారిల్లు’ తెరకెక్కింది. సుంద‌ర్ సూర్య దర్శకుడు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్’లో భావాలు, బావోద్వేగాలు హృద‌యాన్ని హ‌త్తుకునేలా ఉంటాయని చెబుతున్నారు. పాటలు, టీజర్, ట్రైలర్ ఆకట్టుకొంటున్నాయి. ‘అమ్మమ్మగారిల్లు’కి ఫ్యామిలీ ప్రేక్షకులు ఏమాత్రం కనెక్ట్ అయినా.. నాగ‌శౌర్య‌ ఖాతాలో మరో హిట్ పడినట్టే.

క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్.. థియేటర్స్ కి రప్పించగల స్టామినా ఉన్న హీరో రవితేజ. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు. ఇక, నాగ‌శౌర్య‌ కుర్రహీరో. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. మరీ.. రవితేజ పవర్ ని ఈ కుర్ర హీరో ఎలా తట్టుకొంటాడన్నది ఆసక్తిగా మారింది. ఐతే, గతంలో రవితేజని ఓసారి టచ్ చేశాడు శౌర్య‌. టచ్ చేసి చూడు, ఛలో సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద యుద్దానికి దిగాయి. ఈ యుద్ధంలో శౌర్య‌ విజయం సాధించారు. ఛలో.. ఈసారి స్టార్-యంగ్ హీరోల బాక్సాఫీస్ పైట్ ని ఏ రేంజ్’లో ఉండబోతుందనేది ఈ వారం చూద్దాం.. !