కుమారస్వామి అనే నేను..

కర్నాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్ అధినేత కుమార స్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ వాయిభాయ్ వాలా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన తరువాత కాంగ్రెస్ నేత పరమేశ్వర్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమం కన్నుల పండగగా జరిగింది. బీజేపీ యేతర కూటమి ఐక్యత ఇక్కడ కనబడింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సిఎం పినరయ్ విజయన్, బీఎస్సీ అధినేత్రి మాయావతి, ఆర్జేడీ అధినేత కుమారుడు, మాజీ మంత్రి తేజస్వి ప్రసాద్, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు హాజరయ్యారు.

ఇక, మొత్తం 34 మందితో కుమారస్వామి కేబినెట్ కొలువుదీరనుంది. వీరిలో 22 మంది కాంగ్రెస్, 12మంది జేడీఎస్’కు చెందిన వారు ఉండనున్నారు. దేవెగౌడ – సహకార శాఖ, బండెప్ప కషెంపుర – టెక్స్ టైల్ దేవాదాయ శాఖ, డీసీ తమ్మన్న – కార్మిక శాఖ దక్కినట్టు చెబుతున్నారు. ఇక, కాంగ్రెస్’కు చెందిన రోషన్ బేగ్ – అటవీ శాఖ, ఎండి పాటిల్ – ఆహార పౌరసరఫరాల శాఖ, ఆర్వీ దేశ్ పాండే – అసెంబ్లీ వ్యవహారాలు, న్యాయ శాఖ, సతీష్ – చిన్న తరహా పరిశ్రమల శాఖ, డాక్టర్ అజయ్ – సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ,ఆర్. నరేంద్ర – పశుసంవర్ధక శాఖ కేటాయించినట్టు తెలుస్తోంది.