ఏపీలో మూడు ముక్క‌లాటేనా.. !?

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఎప్పుడు ఎవ‌రు ఏ స్టెప్ తీసుకుంటారో.. ఎవ‌రు యూట‌ర్న్ తీసుకుంటారో.. ఎవ‌రు పోటీకి వ‌స్తారో తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప్ర‌స్తుత ప‌రిణామాల నేప‌థ్యంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌హానాడు వేదిక‌గా బీజేపీపై టార్గెట్ ఫిక్స్ చేసి పెట్టారు. రాబోయే రోజుల్లో జాతీయ పార్టీల హ‌వా ఏమీ ఉండ‌ద‌ని తేల్చి చెప్పిన చంద్ర‌బాబు ప్రాంతీయ పార్టీల మ‌ద్యే పోటీ తీవ్రంగా ఉంటుంద‌ని ప‌రోక్షంగా చెప్ప‌న‌ట్ల‌యింది. అంటే 2019లో మూడు పార్టీల మ‌ధ్యే పోటీ నెల‌కొనే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

బీజేపీ అనేక ర‌కాల ట్రిక్స్ ప్లే చేస్తున్నాయ‌ని, వైసీపీ, జ‌న‌సేన పార్టీలు ఆ పార్టీకి వంత పాడుతూ టీడీపీని ఓడించాల‌నుకుంటున్నాయ‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. శ్రేణులు, ఏపీ ప్ర‌జ‌లు బీజేపీ వ్యూహాల‌ను తిప్పికొట్టాల‌ని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణుల మాటెలా ఉన్నా ప్ర‌జ‌లు ఈ అంశాన్ని ఎలా తీసుకుంటార‌న్న‌దానిపైనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ భ‌విష్య‌త్ ఆధార‌ప‌డి ఉంది.

వైసీపీ నేత జ‌గ‌న్, జ‌న‌సేన అధినేత వ్య‌వ‌హార శైలి చూస్తే బీజేపీకి స‌పోర్ట్ చేసేలా ఉన్నాయ‌నిపిస్తున్నా ప్ర‌జ‌ల్లో ఈ అంశం ఎంత బ‌లంగా వెళుతుంద‌నేదే చాలామంది అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌త్యేక హోదా అంశం ఎంత మేర దాచిపెడుతుంద‌నేదిమ‌రో ప్ర‌శ్న‌. ప్ర‌త్యేక హోదా అంశం ప‌క్క‌న‌బెడితే రాష్ట్రంలో ఎంత‌మేర అభివృద్ధి జ‌రిగింది. సంక్షేమ ఫ‌లాలు ప్ర‌జ‌ల‌కు ఏ స్థాయిలో మేలు చేస్తున్నాయి. రాజ‌ధాని అభివృద్ధితో పాటు ఇత‌ర అంశాల్లో జ‌రిగిన ప్ర‌గ‌తి ఏమిట‌నేదానిపై ప్ర‌జ‌ల్లో ఆలోచ‌న మొద‌లైతే మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాస్త ట‌ఫ్ కాంపిటేష‌నే క‌నిపించేలా ఉంది. ఏపీలో ఇక మూడు ముక్క‌లాట త‌ప్ప‌ద‌నే అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు చాలామంది.

ఇప్ప‌టికే వైసీపీ అధినేత జ‌గ‌న్, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌లు మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడు టీడీపీ కూడా దీక్ష‌ల పేరుతో కేంద్ర ప్ర‌భుత్వంపై నిర‌స‌న‌ల కార్య‌క్రమాల‌కు శ్రీ‌కారం చుడుతోంది. మొత్తంగా 2019ఎన్నిక‌ల్లో ఏపీలో మూడు ప్ర‌ధాన ప్రాంతీయ పార్టీల‌మ‌ద్యే పోటీ తీవ్రంగా ఉండ‌నుంది. బీజేపీకి వ్యతిరేక‌, అనుకూల పార్టీలేవి అనే అంశాన్ని ప‌క్క‌న‌బెడితే మూడుముక్క‌లాట‌ను త‌లపించే వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు ఎవ‌రిని వ‌రిస్తుందో చూడాలి..