రైతన్న ముఖంలో చిరునవ్వు చూడాలి : సీఎం కేసీఆర్.
తెలంగాణవ్యాప్తంగా రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకల్లో సీఎం కేసీఆర్ గౌరవ వందనం స్వీకరించారు. నాలుగేళ్లలో తెలంగాణ ప్రగతిని ప్రజలకు వివరించారు. అమరవీరులకు నివాళులర్పించి భవిష్యత్ తెలంగాణ లక్ష్యాలేమిటనేదానిపై వివరణ ఇచ్చారు. ప్రజల్లో మానసిక స్థైర్యాన్ని పెంచుతూనే సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామని, రైతులందరికీ రూ.5లక్షల జీవితభీమా అమలుచేస్తున్నామని ఆయన తెలిపారు. రైతు ప్రమాదవశాత్తూ చనిపోతే ఆ కుటుంబం చిన్నాభిన్నమవుతోందని, ఈ పరిస్థితి రాకూడదనే రైతు భీమా పథకాన్ని తీసుకొచ్చామని, రైతుల నుంచి రూపాయి తీసుకోకుండా రూ.5లక్షల బీమా సదుపాయం కల్పిస్తున్నామన్నారు.
రైతులకు రుణమాఫీ, వ్యవసాయ పరికరాలకు రాయితీ , నీటితీరువా, ట్రాక్టర్లపై వాహనం పన్ను రద్దు చేస్తూ రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవదాయిని కానుందని, దేశంలో ఎక్కడా లేని విధంగా వేగంగా, ఆధునిక పరిజ్ఞానంతో కాళేశ్వరం నిర్మిస్తున్నామని, కేంద్ర జలసంఘం సభ్యులు కూడా కాళేశ్వరం నిర్మాణాన్ని మెచ్చుకున్నారని తెలిపారు.
రైతు బంధు పథకంతో రైతుల ముఖాల్లో ఆనందం చూస్తున్నామని, ఎకరాకు రూ. 8వేల పెట్టుబడి సాయం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ చెప్పారు. కొందరు ధనిక రైతులు రైతుబంధు చెక్కులు వదులుకుని స్ఫూర్తిగా నిలిచారని, మరికొందరు రైతులు రైతుబంధుకు విరాళాలిచ్చి తమ మంచి మనసు చాటుకున్నారని ముఖ్యమంత్రి కొనియాడారు. రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేసి, వారి ముఖాల్లో చిరునవ్వును చూడటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు సీఎం.