కాంగ్రెస్ లో చేరడానికి కారణమదే: నాగం
మొదట్లో తెలుగుదేశంలో క్రియాశీలకంగా వ్యవహరించి ఆ తరువాత బీజేపీలో చేరి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నాగం జనార్థన్ రెడ్డి తన మనసులో మాట చెప్పేశారు. తాను కాంగ్రెస్ లో చేరిన తర్వాత దామోదర్ రెడ్డి ఇంటికి వెళ్లి కలిసి వచ్చానని, తనకు ఆయనకు ఎలాంటి వైరం లేదని స్పష్టం చేశారు. కలిసి పనిచేస్తూ, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఇద్దరం అనుకున్నామని చెప్పారు నాగం.
సీఎల్పీ నేత జానారెడ్డి, డీకే అరుణ కూడా దామోదర్ రెడ్డి కిఫోన్ చేసి మాట్లాడారని, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పుకొచ్చారు. ఆయన తనకు మంచి మిత్రుడని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా దామోదర్ కు సహకరించానని అన్నారు నాగం. టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, తాను అలాంటి వ్యక్తిని కాదని అన్నారు. తన లక్ష్యం టీఆర్ఎస్ ను గద్దె దించడమేనని, అందుకే కాంగ్రెస్ లో చేరానని చెప్పారు.