తొలి అమరుడు శ్రీకాంతాచారికే అవమానం..!
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున తెలంగాణ మలిదశ ఉద్యమం తొలి అమరవీరుడు శ్రీకాంతాచారిని అవమానించారంటూ తల్లి శంకరమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో తమను అవమానించారంటూ ఆమె అధికారులతో వాగ్వాదానికి దిగారు.
రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాంతాచారిని గౌరవిస్తున్నా జిల్లాస్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం శ్రీకాంతాచారిని గౌరవించడం లేదని ఆమె అన్నారు. మొదటగా గుర్తించాల్సిన శ్రీకాంతాచారి కుటుంబాన్ని అందరికంటే చివరిలోపిలిచి అవమానించారని, ఒక బీసీని కాబట్టే కావాలని ఇలా చేశారని ఆమె ఆరోపించారు. సీఎం కేసీఆర్ తండ్రిలాంటి వారని, ఆయన తమను అన్ని విధాలా ఆదుకున్న దేవుడని అయితే జిల్లా అధికారులు శ్రీకాంతాచారి త్యాగాన్ని గుర్తించకుండా తమను అవమానపరిచారని ఆమె అన్నారు. పిలవకపోయినా ఫరావాలేదు కానీ , పిలిచి ఇలా అవమానించడం పద్దతి కాదని అన్నారు. నిజంగా జిల్లా అధికారులకు ప్రాధాన్యత క్రమం మరిచారో లేక కావాలనే చేశారోగానీ ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.