ఇ-టికెట్‌ వెయిటింగ్‌ లిస్ట్‌లోని వాళ్లూ రైలెక్కొచ్చు..!!

నిరీక్షణ జాబితాలో ఉన్న ప్రయాణికుల వద్ద ఇ-టికెట్లు ఉన్నప్పటికీ రైలు ఎక్కొచ్చని సుప్రీంకోర్టు ఆదేశించింది. టికెట్‌ బుక్‌ చేసుకున్న బెర్త్‌లలోని ప్రయాణికులు హాజరుకానప్పుడు ఆ బెర్త్‌లను వెయిటింగ్‌ లిస్ట్‌లోని వారికి కేటాయిస్తారు. అయితే సాధారణ టికెట్‌ కాకుండా ఇ-టికెట్‌ ఉన్నా, వారిని రైలు ఎక్కనివ్వాలని, బెర్త్‌ కేటాయించాలని సుప్రీం కోర్టు వెల్లడించింది. నిరీక్షణ జాబితాలో ఉండి స్టేషన్‌లో కొనుగోలు చేసిన టికెట్‌ కలిగి ఉన్న ప్రయాణికులను మాత్రమే రైల్లోకి ఎక్కేందుకు అనుమతిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ప్రయాణికులు రాకపోతే వారికి బెర్త్‌ పొందే అవకాశం ఉంటుంది. అయితే వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉండి ఇ-టికెట్లు ఉన్న వారిని రైలు ఎక్కడానికి అనుమతించడం లేదు.

2014 జులైలో ఢిల్లీ హైకోర్టు ఇ-టికెట్లను కూడా సాధారణ టికెట్లుగానే పరిగణించాలని, వాటి వల్ల ప్రయాణికులకు నష్టం కలగకూడదని తీర్పిచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ రైల్వే సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయగా, దానిని కోర్టు తిరస్కరించింది. దీంతో ఇ-టికెట్లను కూడా సాధారణ టికెట్లతో సమానంగా పరిగణించి వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉండి ఇ-టికెట్లు కలిగి ఉన్న వారిని కూడా రైల్లోకి అనుమతించాల్సి ఉంటుంది. సాధారణ టికెట్‌, ఇ-టికెట్‌ మధ్య తేడాలను దూరం చేయాలని కోర్టు ఈ సందర్భంగా రైల్వే మంత్రిత్వ శాఖను కోరింది.