ఓడిందెవరు..? గెలిచిందెవరు..?
విపక్షాల దూకుడుకు కళ్లెం వేసేందుకు తెలంగాణ సర్కారు గత అసెంబ్లీ సమావేశాల్లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. శాసన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయం అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రశ్నిస్తే ఉక్కుపాదమేనా అంటూ విపక్ష కాంగ్రెస్ నేతలు ఆందోళన బాట కూడా పట్టారు. దీక్షలు, నిరసనలు చేపట్టారు. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబ్లీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు కూడా శాసన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయంపై తీర్పునిస్తూ వారి సభ్యత్వాన్ని కొనసాగించాల్సిందేనని తేల్చి చెప్పింది. హైకోర్టు ఇచ్చిన ఆ తీర్పు ప్రతిపక్ష కాంగ్రెస్ లో మరింత జోష్ ను నింపడమే కాకుండా తమ తొలి విజయంగా చెప్పుకున్నారు కాంగ్రెస్ శ్రేణులు. అధికార పార్టీ నేతలు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మళ్లీ పిటిషన్ వేశారు. అధికార పార్టీ వ్యూహం ఎలా ఉందో కానీ అంతటితో ఆ అంశాన్ని వదిలేసి ఉంటే బాగుండేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అప్పటికి తామేదో ఓటమికి గురైన ఫీలింగ్ అధికార పార్టీ నేతల్లో బలంగా ఉండటం వల్లే మళ్లీ పిటిషన్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అధికార పార్టీ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేయడంతో అది కాంగ్రెస్ శ్రేణులకు మరింత బూస్టింగ్ ఇచ్చినట్లయింది. పైగా రెండోసారి కూడా తాము గెలిచామనే ధీమా ఏర్పడింది వారిలో. ఆ సంగతి అటుంచితే ప్రజల్లో అధికార పార్టీ వైఖరిపై ఈ రెండు తీర్పులు నెగిటివ్ గా వెళ్లే ప్రమాదమూ లేకపోలేదు. రాజకీయంగా ఇది కాంగ్రెస్ పార్టీకి మైలేజీ పెంచడమే కాకుండా జనంలోకి వెళ్లినపుడు ఇది ఒక అస్త్రంగా కూడా ఉపయోగించుకునే అవకాశమూ లేకపోలేదు. చిన్న విషయాలను కూడా పెద్దగా ఆలోచించడం వల్ల ఇష్యూ పెద్దదై అది అధికార పార్టీకి నష్టం చేస్తోందనే వాదనను ఈ సంఘటన నిజం చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ముందుగా ఇద్దరు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ ల శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నప్పటికీ న్యాయస్థానాల్లో ఈ ప్రభుత్వానికి చుక్కెదురవడం ఒక రకంగా ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే అంశమే. ఎవరేమనుకున్నా, ఇతర అంశాలు ఎలా ఉన్నా ఈ అంశంలో మాత్రం కాంగ్రెస్ దే విజయమని చెప్పుకుంటున్నారు జనాలు. కానీ ఎన్నికల నాటికి పరిణామాలు ఎలా మారతాయో ఎన్నికల రణరంగంలో ఓడేదెవరో, గెలిచేదెవరో చూడాలి మరి.