కడపపై కన్నేసిన టీడీపీ..!!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వ్యూహ,ప్రతి వ్యూహాలతో ముందుకెళుతున్నారు ఆయా పార్టీల నేతలు.. ఒక వైపు వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర, మరో వైపు జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటనలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్న నేపథ్యంలో వారికి ధీటుగా ఎదుర్కొనేందుకు అధికార టీడీపీ వ్యూహరచన చేస్తోంది. అంతర్గత కుమ్ములాటలతో పార్టీ బలహీన పడకుండా వచ్చే ఎన్నికల్లో కడప జిల్లాలో మెజారిటీ సీట్లను కైవసం చేసుకునే ప్రయత్నం మొదలు పెట్టింది.
జగన్ సొంత జిల్లాలోనూ ఎక్కువ సీట్లను గెలుచుకుంటే విపక్షాలకు ధీటైన సమాధానం చెప్పినట్లవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే కడప జిల్లాలో పార్టీలో, పార్టీనేతల మధ్య ఉన్న విభేధాలను నిలువరించేందుకు రంగంలోకి దిగారు. పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి వారి మధ్య విభేధాలు పక్కకకు పెట్టి పార్టీ కోసం పనిచేసేలా కృషి చేయాలని దిశానిర్ధేశం చేశారు.
ఎవరెవరి మద్య ఏ కారణాలతో విభేదాలు ఏర్పడ్డాయో తెలుసుకుని , వారి సమస్యలను తీర్చడమే కాకుండా ,ప్రభుత్వ పథకాలు, జిల్లాకు ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికా ప్రకారం పనిచేయాలని ఆదేశించారట. వచ్చే ఎన్నికల్లో వైసీపిని ధీటుగా ఎదుర్కోవడమే కాకుండా వీలైనన్ని ఎక్కువ సీట్లను గెలుచుకునేలా కృషిచేయాలని చెప్పారు టీడీపీ అధినేత. ఎప్పటికప్పుడు సమీక్ష చేసే బాద్యతలను కూడా పార్టీలో కొందరు కీలక నేతలకు అప్పగించారట కూడా. మొత్తంగా కడప జిల్లాపై టీడీపీ ఎక్కువగా దృష్టి పెట్టింది. ఈ విషయంలో వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నట్లుగా కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు.