రాజకీయ భవిష్యత్ పై మోత్కుపల్లి కీలక నిర్ణయం..!
టీడీపీ బహిషృత నేత మోత్కుపల్లి నర్సింహులు తన రాజకీయ భవిష్యత్ పై కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఓటమే తన లక్ష్యమని ప్రకటించిన ఆయన గత కొన్నాళ్లుగా ఆయన్ను విమర్శిస్తూ వస్తున్నారు. అవసరమైతే ఏపీలో తిరుపతి వెంకన్నకు మొక్కుకుని యాత్ర చేస్తానని కూడా ప్రకటించారు. అయితే కొద్దిరోజులుగా వివాదాస్పద వ్యాఖ్యలకు బ్రేక్ ఇచ్చిన మోత్కుపల్లి రాజకీయంగా ముందుకెళ్లేందుకు ప్రణాళికలు రచించుకున్నారు.
ఆయన మాట్లాడిన ప్రతీసారి ఆరుసార్లు తనను శాసనసభ్యునిగా గెలిపించిన ఆలేరు ప్రజలను గుర్తుచేసుకుంటుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో క్రియాశీల నేతగా ఎదిగిన ఆయన ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆలేరును వీడకూడదని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ప్రజావేదిక పేరుతో ఆలేరు నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించుకున్న ఆయన టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వివిధ మండలాల నుంచి వచ్చిన ఆయన అనుచరులు పార్టీ పదవులకు, ప్రాథమిక సబ్యత్వానికి రాజీనామా చేసి ఆయన వెంటే ఉంటామంటూ తీర్మానించుకున్నారు.
చంద్రబాబు తనను మోసం చేశాడనే సెంటిమెంట్ ను ఆలేరు ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఈసారి ఖచ్చితంగా ఆలేరు బరిలో తానున్నానని ప్రజావేదిక సాక్షిగా నిర్ణయం తీసుకున్నారు మోత్కుపల్లి. ఏ పార్టీ నుంచి పోటీ చేసేది కాలమే నిర్ణయిస్తుందని చెబుతున్న ఆయన ఆలేరు టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంటే టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగానైనా సరే గెలిచి తన సత్తా చాటాలని భావిస్తున్నారు. మొత్తంమీద ఈసారి ఆలేరు బరిలో మోత్కుపల్లి ఉంటారనేది ఖాయమైంది. ఇది మోత్కుపల్లి రాజకీయ భవిష్యత్ కు కీలకంగా మారుతుందనడంలో ఎలాంటి సంశయం లేదు.