ఏది శాస్త్ర స‌మ్మ‌తం..?

అత్య‌ద్భుత పుణ్య‌క్షేత్రంగా యాదాద్రి ఆల‌యాన్ని అభివృద్ధి ప‌ర‌చాల‌నేది సీఎం కేసీఆర్ సంక‌ల్పం. వైష్ణ‌వ పీఠాధిప‌తి చిన‌జీయ‌ర్ స్వామి సూచ‌న‌ల‌తో యాదాద్రి ఆల‌య ప‌నర్నిర్మాణ ప‌నులు ప్ర‌స్తుతం ఒక రూపానికి వ‌చ్చాయి. ముఖ‌మండ‌పంపై స్లాబ్ నిర్మాణం పూర్త‌యింది. రాజ‌గోపురాలు, ఆల‌య ముఖ మండ‌పం, ప్రాకారాల నిర్మణాలు అనుకున్న ప్ర‌కారం పూర్తి చేసేందుకు ప‌నులు వేగ‌వంతం చేస్తున్నారు అధికారులు.అయితే ప్ర‌ధాన ఆల‌యంపై జ‌రుగుతున్న నిర్మాణాల విష‌యంలో పండితుల మ‌ధ్య ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ముందు అనుకున్న దానికి భిన్నంగా ఇప్పుడు నిర్మాణాలు జ‌రుగుతున్నాయనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

మొద‌ట్లో ప్ర‌ధానాల‌యంపై ఉన్న పాత విమాన గోపురాన్ని తొల‌గించ‌కూడద‌ని చిన‌జీయ‌ర్ స్వామి సూచించ‌డ‌మేకాకుండా ఈ అంశంపై చాలాకాలం ఆయ‌న పున‌రాలోచ‌న జ‌రిపారు. పాత విమాన గోపురాన్ని అలాగే ఉంచుతూ ఆల‌యానికి నాలుగువైపులా పిల్ల‌ర్స్ నిర్మించి స్లాబ్ వేయాల‌ని సూచించారు. పాత విమాన గోపురం క‌నిపించేలా అక్క‌డ క‌ప్పు వేయ‌కుండా దాని చుట్టూ రాతితో మ‌రోవిమాన గోపురం నిర్మించేలా ప‌నులు జ‌రుగాల‌ని చెప్పారు. కానీ ఆగ‌మ‌శాస్త్ర నిబంధ‌న‌ల ప్ర‌కారం అలా చేయ‌డం స‌రైన‌ది కాద‌ని భావించారో లేక భ‌విష్య‌త్ లో ఏదైనా స‌మ‌స్య ఎదుర‌వుతుంద‌ని భావించారో ఏమో గానీ ముందు అనుకున్న దానికి భిన్నంగా పాత విమాన గోపురాన్ని పూర్తిగా కూల్చివేశారు. దీంతో స్వ‌యంభూ నార‌సింహుడు వెల‌సిన కొండ గుహ‌కు ఇప్పుడు నిర్మిస్తున్న విమాన గోపురానికి మ‌ధ్య ఖాళీ ఏర్ప‌డింది.

ఆల‌యానికి విమాన గోపురానికి మ‌ధ్య ఖాళీ ఉండ‌కుండా కృష్ణ శిల‌ల‌తో చేసిన మూడు రూపాల్లో నార‌సింహుడి ప్ర‌తిమ‌ల‌ను ఏర్పాటు చేయాల‌ని జీయ‌ర్ స్వామి సూచించారు. గ‌తంలో పున‌ర్నిర్మాణ ప‌నులు ప్రారంభ‌మైన మొద‌ట్లో ప‌నులు చేస్తున్న క్ర‌మంలో గంఢ‌భేరుండ‌ నార‌సింహుడు వెల‌సిన రాతి శిలకు ప‌గుళ్లు వ‌చ్చాయి. నిర్మాణాల్లో స్వ‌ల్ప మార్పులు చేసి ఎలాగోలా త‌ప్పును క‌ప్పిపుచ్చుకున్నారనే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఇప్పుడు కూడా స‌హ‌జ‌సిద్దమైన కొండ‌గుహలో వెల‌సిన స్వ‌యంభూ నార‌సింహుడి విమాన గోప‌రం తొల‌గించ‌డం, దానిపై నిర్మాణాలు చేప‌ట్ట‌డంపై భ‌క్తులు ఆందోళ‌న వ్య‌క్తమ‌వుతోంది. గంఢ‌భేరుండ నార‌సింహుడిలాగే స్వ‌యంభూ నారసింహుడి కొండగుహ స‌హ‌జ‌త్వం ఎక్క‌డ పోగొడ‌తారోనంటూ అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

దేశంలో ఎక్క‌డా లేని విధంగా ప్ర‌ధాన ఆల‌యానికి విమాన గోపురానికి మ‌ధ్య ఖాళీ స్థలం ఉండ‌ట‌మేంటో అంటూ గుస‌గుస‌లాడుకుంటున్నార‌ట‌. ఒక‌వేళ రాతిక‌ట్ట‌డం బ‌రువుకు కొండ గుహ నిలువ‌లేద‌నుకుంటే పాత విమాన గోపురాన్ని అలాగే ఉంచి ఇప్పుడు చేస్తున్న నిర్మాణాల‌ను అలాగే కొన‌సాగించి ఉండాల్సింద‌న్న వాద‌న కొంద‌రు వినిపిస్తున్నారు.. జీయ‌ర్ స్వామి అంత‌టివారే సూచించారంటే బాగా ఆలోచించే ఆ నిర్ణ‌యానికి వ‌చ్చి ఉంటార‌ని ఎవ‌రికి వారు స‌ర్థిచెప్పుకుంటున్నారు. ఏదేమైనా ముందు ఒక‌లా , త‌రువాత మ‌రోలా నిర్ణ‌యాలు మార్చుకోవ‌డంపై భ‌క్తుల్లో ఒక చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి.