బీజేపీ ఆపరేషన్ ఏపీ…!!
టీడీపీ, బీజేపీ బంధం చెడిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను బీజేపీ సీరియస్ గా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. గత కొన్నాళ్లుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు గమనిస్తే ఈ అంశం స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీలో టీడీపీని గద్దె దించేందుకు వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్ని బీజేపీ జారవిడుచుకోవడంలేదు. ఏపీ ప్రజల్లో బీజేపీ పై సానుకూల ధృక్పథం ఏర్పడే చర్యలను పక్కనపెడితే రాష్ట్రంలో అధికార టీడీపీని ఓడించడమే లక్ష్యంగా ముందుకెళుతోంది బీజేపీ అధినాయకత్వం. ఆ దిశగా వ్యూహాలకు పదును పెడుతోంది.
గత నాలుగు రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను చూస్తే వరుసగా జరుగుతున్న సమావేశాలు ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. మంగళవారం ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ, నేతలు పురందేశ్వరి, ఆకుల సత్యనారాయణ ఢిల్లీకి వెళ్లడం ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కించాయి. బుధవారం మోదీని కలిసిన కన్నా, ఆ తర్వాత పీఎంఓ అధికారులతోనూ సమావేశమయ్యారు. ఆకుల సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన గురువారం రాంమాధవ్‌ను కలిశారు. శుక్రవారం గవర్నర్ నరసింహన్.. ఉదయం రాజ్‌నాథ్ సింగ్, సాయంత్రం ప్రధాని మోదీని కలిశారు. ఏపీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు ఇలా ఢిల్లీలో వరుసపెట్టి మోదీ, షాలను కలవడం, సమావేశాలు నిర్వహించడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.
కేవలం చంద్రబాబు టార్గెట్‌గానే ఈ మొత్తం వ్యవహారం నడుస్తోందంటూ అటు టీడీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. రాజకీయ చాణక్యుడిగా పేరున్న చంద్రబాబు నాయుడు కూడా తన వ్యూహానికి పదును పెడుతూ ఎప్పటికప్పుడు విపక్షాల వ్యూహాలను తిప్పికొట్టేలా పార్టీ నేతలను సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే గవర్నర్‌ను కలిసిన ప్రధాని మళ్లీ ఇంతలోనే ఆయనను కలవడాన్ని టీడీపీ తప్పు పడుతోంది. రాజ్యాంగాన్ని అవమానించడమేనంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై ట్వీట్ చేశారు కూడా. మొత్తం మీద బీజేపీ ఆపరేషన్ ఏపీ పై మరింత స్పీడ్ పెంచినట్లుగా కనిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా ఏడాది కూడా సమయం లేకపోవడంతో ఈ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. మరి ఏపీ ప్రజలు ఎవరి వైపు నిలుస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..