ఫెడ‌ర‌ల్ ఫ్రంట్… ఫ్రెండ్లీ ఫ్రంట్ అవుతోందా…!?

అయితే కాంగ్రెస్..లేక‌పోతే బీజేపీలేనా దేశాన్ని పాలించేది.. దేశ రాజ‌కీయాల్లో మార్పు రావాలి.. ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయం కావాలని, ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ తో దేశరాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతామంటూ ప్ర‌క‌టించారు సీఎం కేసీఆర్. దేశ్ కీ నేతా కేసీఆర్ అంటూ టీఆర్ఎస్ నేత‌లు, కేసీఆర్ అభిమానులు ఓ రేంజ్ లో ప్ర‌చారం చేస్తూ వ‌చ్చారు. మ‌మ‌తా బెన‌ర్జీని క‌ల‌వ‌డం, క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో జేడీఎస్ కు మ‌ద్ద‌తివ్వ‌డం ఇలా చ‌క‌చ‌కా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తూ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు అడుగులు ప‌డిన‌ట్లేన‌ని అంతా భావించారు. అయితే తాజ‌గా జ‌రుగ‌తున్న ప‌రిణామాలు మాత్రం ప‌లు అనుమానాలు క‌లిగేలా చేస్తున్నాయి. రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నాకు సైతం అంతుబ‌ట్ట‌డం లేద‌ట‌.

ప్ర‌ధాని మోడీని ఓ రేంజ్ లో తిట్టిపోసిన కేసీఆర్ తాజాగా ఢిల్లీలో ఆయ‌న‌తో భేటీ అవ‌డంపై ఒక‌ర‌కంగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటుపై అనుమానాల‌కు తావిస్తోంది. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో ఎన్డీఏయేత‌ర ముఖ్య‌మంత్రులు క‌ల‌వ‌డం, కేజ్రీవాల్ కు మ‌ద్ద‌తు తెల‌ప‌డంవిష‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ రిజ‌ర్వ్డ్ గా వ్య‌వ‌హ‌రించారు. అటు మ‌ద్ద‌తు తెలిపిన‌ట్టుకానీ, వ్యతిరేకించిన‌ట్టుకానీ ఏదీ చేయ‌లేదు. క‌నీసం వారితో క‌లిసే ప్ర‌య‌త్నం కూడా చేయ‌లేదు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అనేది బీజేపీ గేమ్ ప్లాన్ లో భాగ‌మేనంటూ గ‌తంలో కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శించారు. అయితే ప్ర‌స్తుతం సీఎం కేసీఆర్ వ్య‌వ‌హార‌శైలి, జ‌రుగుతున్న ప‌రిణామాలు ఆ విమ‌ర్శ‌ల‌కు బ‌లాన్ని చేకూరుస్తున్నాయ‌ని చెప్పొచ్చు. మోదీ, కేసీఆర్ భేటీకి సంబంధించి ఒక కేట‌గిరీకి చెందిన ఓట‌ర్లు ప‌ట్టించుకోక‌పోయినా, కాస్త రాజ‌కీయ ప‌రిజ్ఞానం ఉన్న వారు కాస్తో కూస్తో ఆలోచించే అవ‌కాశం లేక‌పోలేదు.

ఒక‌వేళ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పై అడుగులు ముందుకు ప‌డ‌తాయ‌ని భావించినా , ఎన్డీఏయేత‌ర ముఖ్య‌మంత్రులు ఎవ‌రు కేసీఆర్ కు మ‌ద్ద‌తు తెలుపుతారు అనేది సందేహంగానే మిగిలిపోతుంది. ఆశించిన మేర మ‌ద్ద‌తు ల‌భించ‌నందు వ‌ల్లే ఫ్రంట్ విష‌యం పై మ‌ళ్లీ కేసీఆర్ మాట్లాడటం లేద‌నేది విశ్లేష‌కులు చెబుతున్న మాట‌. మొత్తంగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూ ప్ర‌క‌ట‌న చేసిన కేసీఆర్ ఆ దిశగా అంద‌రూ ఊహించినంత స్పీడ్ గా అడుగులు వేయ‌క‌పోవ‌డం, ప్ర‌ధాని మోదీతో భేటీ కావ‌డం, కేజ్రీకి సంఘీభావం తెల‌ప‌క‌పోవ‌డం, క‌నీసం బీజేపీకి వ్య‌తిరేకంగా ఎలాంటి అడుగులు వేయ‌క‌పోవ‌డాన్ని బ‌ట్టి ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కాస్త ఫ్రెండ్లీ ఫ్రంట్ గా మారిపోయినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రంలేద‌ని రాజ‌కీయంగా ఓ విశ్లేష‌న‌కు వ‌స్తున్నారు చాలామంది. చూడాలి మ‌రి భ‌విష్య‌త్ రాజ‌కీయ ప‌రిణామాలు ఎలా మార‌తాయో..!