రాహుల్ కు టీకాంగ్రెస్ నేతలు ఏం చెప్పారబ్బా…!!
తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ ఢిల్లీ పర్యటన తరువాత హుటాహుటిన గాంధీభవన్ లో సమావేశమైన కొంతమంది టీకాంగ్రెస్ నేతలు మూకుమ్మడిగా ఢిల్లీ వెళ్లి రాహుల్ ను కలవాలని నిర్ణయించుకున్నారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉత్తమ్ రాష్ట్ర పరిస్థితులను వివరించారని, సీనియర్లకు ప్రాధాన్యత ఉంటుందంటూ ఆయన చెప్పినప్పటికీ రాహుల్ పుట్టినరోజు సాకుగా పీసీసీపై ఫిర్యాదులు జరిగాయన్నది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. ఉత్తమ్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ, తన టీమ్ ను మాత్రమే తయారు చేయాలనుకుంటున్నారనే పార్టీలో అంతర్గతంగా ఓ చర్చ జరుగుతోందంటూ గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి.
మరో వైపు ఉత్తమ్ పీసీసీగా ఉంటే కేవలం 15సీట్లు మాత్రమే వస్తాయంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యానించినట్లుగా కూడా చెప్పుకుంటున్నారు చాలామంది. పీసీసీ మార్పు ఉంటుందని భావించినప్పటికీ అది కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున కోమటిరెడ్డి నిరాశకు గురయ్యారనే మాట కూడా తాజగా వినిపిస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియయా చేసిన తాజా వ్యాఖ్యలు భుజాలు తడుముకున్న చందంగా ఉందనేది కొందరి వాదన.
టీపీసీసీపై రాహుల్ గాంధీకి ఎలాంటి ఫిర్యాదులు ఎవరూ చేయలేదని, కేవలం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే టీకాంగ్రెస్ నేతలు వెళ్లారని చెప్పుకొచ్చారు కుంతియా. రాహుల్ తో జరిగిన భేటీలో తానూ ఉన్నానని కూడా చెప్పారు. ఈ అంశంపై రాహుల్ ను కలిసిన కాంగ్రెస్ నేతలెవరూ ప్రస్తావించకపోవడం, పీసీసీపై ఫిర్యాదులు చేశారన్న వార్తలను ఖండించకపోవడాన్ని బట్టి చూస్తే కుంతియా చెప్పినదానికి అక్కడ జరిగిన దానికి పొంతనలేదనే విశ్లేషకులు చెబుతున్నారు.
అంతర్గత కలహాలు ఎక్కువ ప్రచారంలోకి వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పై ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయనే కుంతియా పార్టీ నేతల వ్యవహారాన్ని సమర్థించుకున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. రాహుల్ తో టీ కాంగ్రెస్ నేతలు ఏం చెప్పారనేది ఓపెన్ సీక్రెట్ అయినప్పటికీ ఆ విషయాన్ని కప్పిపుచ్చడం అనేది ఎలాంటి చర్యో వారే ఆలోచించుకోవాలంటున్నారు మరి కొంతమంది..