గురుకులాల్లో నీట్ , జేఈఈ కి కోచింగ్…!!
ప్రభుత్వ కళాశాలల్లో విద్యాప్రమాణాలను మెరుగుపరిచే విధంగా తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది.
నీట్, జేఈఈ పరీక్షల్లో తెలంగాణ గురుకుల, మోడల్ స్కూల్, కేజీబీవీ విద్యార్థులే అధికంగా సీట్లు కైవసం చేసుకునేలా ఇంటర్ మొదటి సంవత్సరం నుంచే వారికి కోచింగ్ ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సంక్షేమ గురుకుల కార్యదర్శులను ఆదేశించారు. ఈ సంవత్సరం ప్రైవేట్ విద్యా సంస్థల కంటే గురుకుల విద్యార్థులే మంచి ఫలితాలు సాధించారని ఆయన అన్నారు. కేవలం మార్కులు సాధించడమే కాకుండా మంచి ప్రమాణాలు కలిగిన విద్యార్థులను రూపొందించే విధంగా విద్యాబోధన, శిక్షణ ఉండాలని సూచించారు. తెలంగాణలో చదివిన విద్యార్థి ఎవరితోనైనా పోటీ పడగలరనే నమ్మకాన్ని వారిలో కల్పించాలని చెప్పారు.
గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్ల లో చదివే ఆడపిల్లల్లో రక్తహీనత లేకుండా ఉండేందుకు ప్రత్యేక పోషకాహారాన్ని ఇవ్వాలని, వారి ఆరోగ్య పరిరక్షణ కోసం గైనాకాలజీ డాక్టర్లతో గురుకులాల్లో అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని సంక్షేమ గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, హాస్టళ్లలో ఒకే రకమైన మెను, వసతులు, పాఠ్యాంశాలు, అకాడమిక్ క్యాలెండర్, యూనిఫామ్స్, హెల్త్ అండ్ హైజీన్ కిట్ల పంపిణీ ఉండేలా సమన్వయంతో పనిచేయాలన్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు, సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతులు, మైనారిటీ, విద్యాశాఖ గురుకుల కార్యదర్శులు, మోడల్ స్కూల్స్, కేజీబీవీల డైరెక్టర్లతో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
రానున్న నీట్, జేఈఈ పరీక్షలలో ఎక్కువగా సిబిఎస్ఈ సిలబస్ ప్రకారం ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుందని, గురుకుల విద్యార్థులకు కూడా ఇంటర్ మొదటి సంవత్సరం నుంచే ఈ పోటీ పరీక్షల్లో ఎక్కువ సీట్లు సాధించేలా కోచింగ్ ఇవ్వాలని సూచించారు.