నానికి టికెట్ ఖరారు
నేచురల్ స్టార్ నానికి పొలిటికల్ టికెట్ ఖరారైంది. ఆయన రాజకీయాల్లోకి దిగనున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్స్ రాజకీయాలని టచ్ చేశారు. యంగ్ హీరో రానా దగ్గుపాటి రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. లీడర్, నేనే రాజు నేనే మంత్రి సినిమాల్లో సీఎం పాత్రలో కనిపించారు. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్యమంత్రి పదవికే వన్నె తెచ్చారు. ‘భరత్ అను నేను’ అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. భరత్.. ని బ్లాక్ బస్టర్ హిట్ చేశారు ప్రేక్షకులు.
ఇప్పుడు నాని కూడా పొలిటిక్స్ ని టచ్ చేయనున్నారు. కొత్త దర్శకుడు నాని కోసం ఓ పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథని రెడీ చేశాడు. దానికి ‘సభకు నమస్కారం’ టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు చెబుతున్నారు. దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే దిల్ రాజు బ్యానర్ లో నాని నటించిన నేను లోకల్, ఎంసిఎ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మూడో సినిమాకి స్క్రిప్ట్ రెడీ అయ్యింది.
ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు నాని. ఆ తర్వాత ‘మళ్లీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘జెర్సీ’ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఈ రెండూ సినిమాల తర్వాత నాని రాజకీయం మొదలెట్టనున్నాడు. రాజకీయాల్లో నాని ఏ పదవిని చేపట్టబోతున్నాడు. నాని కూడా ముఖ్యమంత్రి అవుతారా ? అన్నది తెలియాల్సి ఉంది.