చిరు అల్లుడు కోసం బాలయ్య కూడా !

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ ‘విజేత’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు రాకేశ్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. మాళ‌వికా నాయ‌ర్ హీరోయిన్. ఈ సినిమాను వారాహి సంస్థ నిర్మిస్తోంది. జులై మొదటివారంలో ‘విజేత’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పుడీ సినిమా ప్రమోషన్స్ కోసం మెగా ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగనుంది.

ఈ నెల 24 ‘విజేత’ ఆడియో వేడుక జరగనుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. విశిష్ట అతిథిగా బాల‌కృష్ణ వేదిక‌ను షేర్ చేసుకోనున్నారు. దీంతో విజేత ఆడియో ఫంక్షన్ కోసం మెగా, నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజేతకు మెగా అభిమానుల సపోర్టు ఎలాగో ఉంటుంది. వీరికితోడు నందమూరి అభిమానుల అండ కూడా తోడైతే ‘విజేత’ విజయాన్ని అందుకోవడం మరింత ఈజీ కానుంది.