పీసీసీలో మార్పుల్లేవ్…!!
కాంగ్రెస్ లో పీసీసీలు మారతారంటూ గత కొంత కాలంగా ఓరేంజ్ లో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో నేతల వ్యవహార శైలి, అంతర్గత గ్రూపుల సమావేశాలు ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చాయి కూడా. అయితే పీసీసీ అధ్యక్షుల మార్పులు ఉంటాయని వస్తున్న వార్తలు అవాస్తవమని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియా అన్నారు. ఉత్తమే టీపీసీసీ చీఫ్ గా ఉంటారని, ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తున్నామంటూ కుండబద్దలు కొట్టారు.
పార్టీలో అంతర్గత విభేదాలు ఉంటే అధిష్టానానికి చెప్పవచ్చని, నేరుగా రాహుల్ గాంధీకి కూడా ఫిర్యాదు చేసినా అభ్యంతరం లేదని కుంతియా తేల్చి చెప్పారు. కానీ మీడియా లో ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పార్టీ ని వీడే వారు వీడుతుంటారని, ఆ ఆలోచన ఉన్నవారిని ఎలా ఆపగలమంటూ ఆయన ప్రశ్నించారు. 2014తో పోలిస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంకు 10 శాతం పెరిగిందన్నారు. తాజా సర్వేలు తమకు అనుకూలంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.