ముంద‌స్తుకు వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు…

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా పోటీ చేస్తాన‌ని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలో ఎక్క‌డినుంచి పోటీ చేయ‌మ‌ని సీఎం ఆదేశిస్తే అక్క‌డ పోటీకి సిద్ధ‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే సైబ‌ర్ చ‌ట్టం ప్ర‌కారం చ‌ర్య‌లుంటాయ‌ని హెచ్చ‌రించారు. త‌న‌పై అవినీతి ఆరోప‌ణ‌లు చేసేవారు ఆధారాల‌తో రుజువు చేయాల‌ని అన్నారు. ఐటీ రంగంలో 2ల‌క్ష‌ల ఉద్యోగాలు ప్రాజెక్టుల నిర్మాణాల విష‌యంలో ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు.

వైఎస్ హ‌యాంలో కుప్పంకు మీట‌ర్ ర‌డ్డు కూడా ఇవ్వ‌లేద‌ని, తాము పులివెందుల‌కు కూడా రోడ్లు వేసామ‌ని గుర్తుచేశారు. ఒక్క‌సారి కూడా ఎమ్మెల్యే రాక‌పోయినా పుంగ‌నూరుకు 101కోట్లు మంజూర‌య్యాయ‌ని తెలిపారు. వ‌చ్చే కేబినెట్ లో నిరుద్యోగ భృతికి సంబంధించి తుది రూపు వ‌స్తుంద‌ని, త్వ‌ర‌లోనే విధి విధానాలు ప్ర‌క‌టిస్తామ‌న్నారు. తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మంటూ ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌ల అవ‌స‌రం లేద‌న్నారు లోకేష్. ప్ర‌జ‌లు ఐదేళ్లు పాలించ‌మ‌ని తీర్పునిస్తే ముంద‌స్తు అవ‌స‌రం ఏముంద‌ని ఆయ‌న అన్నారు.