టీఆర్ఎస్ కు తలనొప్పిగా మారిన డీఎస్ వ్యవహారం…!!
నిజామాబాద్ టీఆర్ఎస్ లో గ్రూప్ వార్ మొదలైంది.. ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ వ్యవహారం జిల్లా టీఆర్ఎస్ లో పెద్ద దుమారమే రేపుతోంది. ఇప్పటికే ఆయన తీరుపై నిజామాబాద్ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఫైర్ అయ్యారు. డి.శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. తన కొడుకును బీజేపీకి పంపి కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం గ్రూప్ పాలిటిక్స్ ను ప్రోత్సహిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు.
నిజామాబాద్ రూరల్, అర్బన్ నియోజకవర్గాలలో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ పార్టీకి నష్టం కలిగేలా చేస్తున్నారని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. డీఎస్ కొడుకు టీఆర్ఎస్ ఎంపీలను, ఎమ్మెల్యేలను తీవ్రపదజాలంతో విమర్శిస్తున్నా వారించడంలేదని లోకల్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ విషయంపై సవివరంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు డీఎస్ పై చర్య తీసుకోవాల్సిందిగా లేఖ రాశారు స్థానిక నేతలు.
నిజామాబాద్ లో టీఆర్ఎస్ నేతల మధ్య వివాదం ముదురుతుండటంతో ఎంపీ కవిత ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. కవిత ఇంట్లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ తుల ఉమ, నిజామాబాద్, కామారెడ్డి ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, జీవన్ రెడ్డి తో పాటు ఇతర నేతలు హాజరయ్యారు. వీరితో చర్చించన తరువాత సమస్య తీవ్రతను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది.