కేసీఆర్ ‘దుర్గమ్మ మొక్కు’ తీరింది
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ కనకదుర్గమ్మ మొక్కు తీర్చుకొన్నాడు. అమ్మవారికి చేయించిన ముక్కుపుడకను నెత్తిన పెట్టుకుని మేళతాళాల మధ్య కేసీఆర్ ఆలయంలోనికి ప్రవేశించారు. ముక్కపుడకను కనకదుర్గ అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు కేసీఆర్ గోత్ర నామాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ సతీమణి, కోడలు, మనవలు, పలువురు బంధువులు, తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి కేసీఆర్ నేరుగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. కేసీఆర్ రాక గురించి ముందే తెలిసిన అక్కడి ప్రజలు.. ఆయన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఐతే. కేసీఆర్ టూర్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. మరికొద్దిసేపట్లో కేసీఆర్ హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు.