ఓట్ల కోసమే ‘సర్జికల్‌ స్ట్రైక్స్‌’.. !

‘సర్జికల్‌ స్ట్రైక్స్‌’ అంశాన్ని మోడీ ప్రభుత్వం రాజకీయంగా వాడుకొంటుందన్న వాదన మరోసారి తెరపైకి వచ్చింది. 2016 సెప్టెంబర్‌లో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారత సైన్యం ఉగ్ర స్థావరాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడే దీనికి సంబంధించిన వీడియోలని బయటపెట్టాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. అసలు ‘సర్జికల్‌ స్ట్రైక్స్‌’ జరగలేదు. ఒకవేళ జరిగితే దానికి సంబంధించి రుజువులని రిలీజ్ చేసేందుకు ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. అయినా.. ‘సర్జికల్‌ స్ట్రైక్స్‌’ సంబంధించిన ఒక్క వీడియోని కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. ఐతే, ‘సర్జికల్‌ స్ట్రైక్స్‌’కు మీడియా ఇచ్చిన ప్రాధాన్యతతో బీజేపీ మైలేజ్ వచ్చింది.

ఇప్పుడు ‘సర్జికల్‌ స్ట్రైక్స్‌’కు సంబంధించిన వీడియోలు బయటికొచ్చాయి. టీవీ ఛానెల్స్ వాటిని ప్రసారం చేస్తున్నాయి. ఈ వీడియోలు నిజమైనవేనని సర్జికల్‌ స్ట్రైక్స్‌ ఆపరేషన్‌కు ఇన్‌ఛార్జిగా పనిచేసిన లెఫ్టినెంట్‌ జనరల్‌ డీఎస్‌ హుడా (రిటైర్డ్‌) వెల్లడించారు. దీంతో సర్జికల్‌ స్ట్రైక్స్‌ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటం, ముందస్తు వెళ్లే యోచనలో ప్రధాని మోడీ ఉన్నట్టు వార్తలొస్తున్న నేపథ్యంలో.. ‘సర్జికల్‌ స్ట్రైక్స్‌’ని బీజేపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తుంది. ఇందులో భాగంగానే ‘సర్జికల్‌ స్ట్రైక్స్‌’ వీడియోస్ ని రిలీజ్ చేశారనే ఆరోపణలొస్తున్నాయి.సైనికుల త్యాగాల నుంచి మోదీ ప్రభుత్వం లబ్ధి పొందాలని చూస్తోందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా విమర్శించారు. మరీ.. ఆరోపణలకు మోడీ ప్రభుత్వం ఎలా సమాధానం చెబుతున్నది చూడాలి.