అందుకే కొంత స్థబ్దుగా ఉన్నా..!
కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరిన దానంతో పాటు మాజీ మంత్రి ముఖేష్ కూడా ఇక అధికార పార్టీలో చేరడం ఖాయమని వార్తలు వచ్చాయి. ఆ వార్తలను ముఖేష్ కూడా ఖండించకపోవడంతో ఇక ఆయన గులాబీ కండువా కప్పుకుంటారనే అంతా భావించారు. అయితే ఈ అంశంపై చాలారోజుల తరువాత పెదవి విప్పారు ముఖేష్ గౌడ్. ఆయన తన జన్మదినం సందర్భంగా మీడియాతో తన రాజకీయ భవిష్యత్ పై అభిప్రాయాలను పంచుకున్నారు.
కాంగ్రెస్ లో బీసీ నేతలను అణగదొక్కుతున్నారన్న దానం వ్యాఖ్యలను ముఖేష్ ఖండించారు. బీసీలు యాచించే వారు కాదని, వారు ఎవరికిందా పనిచేయాల్సిన అవసరం లేదన్నారాయన. బీసీలు, దళితులు, మైనారిటీలు కలిస్తే ఎదరుండదని ఆయన చెప్పారు. తాను పార్టీ మారుతున్నానని వస్తోన్న వార్తల్లో నిజం లేదని కార్యకర్తల అభీష్టం మేరకే తాను నడుచుకుంటానని స్పష్టం చేశారు. కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం కాబట్టే సమయం ఇవ్వాలని భావించానని, అందుకే ఇన్నాళ్లూ కొంత స్థబ్దుగా ఉన్నానని చెప్పారు ముఖేష్. గ్రేటర్ లో కాంగ్రెస్ బలంగానే ఉందని, అంజన్ కుమార్ యాదవ్ నాయకత్వంలో పార్టీ కోసం పనిచేస్తానని చెప్పారాయన.