గ్రూపు రాజకీయాలను కాంగ్రెస్ అధిగమించేనా…?
కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు, ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేయడం, నిందించుకోవడం కొత్తేమీ కాదు. కానీ ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీ గ్రూపు రాజకీయాలను సాధ్యమైనంత తగ్గించుకుంటేనే మంచిదంటున్నారు విశ్లేషకులు. ముందస్తు సంకేతాల నేపథ్యంలో కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గ నేతలు, జిల్లా ఇంచార్జులు, పార్లమెంటు నియోజకవర్గ పార్టీ ఇంచార్జిలతో విడివిడిగా సమావేశం నిర్వహించింది కాంగ్రెస్. గాంధీభవన్ లో శనివారం జరిగిన సమావేశం వాడివేడిగా సాగింది.
ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ చీఫ్ ఉత్తమ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశం సాక్షిగా గ్రూపు రాజకీయాలు మరోసారి బయట పడ్డారు. పీసీసీని వైఖరిని బాహాటంగానే సమావేశంలో విమర్శించారు కొంతమంది. మరికొంత మంది వారికి సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. కొన్నిచోట్ల సీనియర్లకు, కొత్తగా పార్టీలో చేరిన వారికి మధ్య మాటలగ్రూపు పాలిటిక్స్ నడుస్తున్నాయని ఈ పరిస్థితికి పీసీసీ వ్యవహార శైలే కారణమంటూ పలువురు ఆరోపించారు. గెలుపు గుర్రాలకే ఈ సారి టిక్కెట్లివ్వాలంటూ ఏఐసీసీ కార్యదర్శులకు విన్నవించారు కొంతమంది.
సమావేశంలో సలహాలకంటే, ఫిర్యాదుల సంఖ్యే ఎక్కువగా ఉందట. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో పార్టీలో పరిస్థితి పార్టీ పెద్దలకు ఈ సమావేశంలో కళ్లకు కట్టినట్లు కనిపించిందట. ఇక నుంచి ఎలా ముందుకెళ్లాలి, ఎక్కడ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలి, ఎవరెవరికి ప్రాధాన్యతనివ్వాలనే అంశాలపై ఒక క్లారిటీ వచ్చిందట టీకాంగ్రెస్ కు. అధికార టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలనేదానిపై కసరత్తు ప్రారంభించిందట కాంగ్రెస్..అయితే గ్రూపు రాజకీయాలను పక్కనబెట్టి పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా కృషి చేస్తేనే ఫలితం ఆ పార్టీకి అనుకూలంగా ఉంటుంది. మరి ఎన్నికల నాటికి కాంగ్రెస్ గ్రూపురాజకీయాలను ఏమేరకు అధిగమిస్తుందో చూడాలి…