వీడిన ఢిల్లీ సామూహిక ఆత్మహత్యల మిస్టరీ..!
దేశ రాజధాని ఢిల్లీలో ఒకే కుటంబంలో 11మంది సామూహికంగా ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. అసలు ఎందుకు వారు ఆత్మహత్య చేసుకున్నారు.. అవి హత్యలా లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. అయితే, ఈ ఆత్మహత్యలకు సంబంధించి మరిన్ని వివరాలు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడయ్యాయి.
పదకొండు మందిలో ఆరుగురు కేవలం మెడకు ఉరి బిగుసుకున్న కారణంతోనే మరణించారని మృతదేహాలకు పోస్టుమార్టం చేసిన వైద్యులు తేల్చారు. మరో నలుగురికి తినే ఆహారంలో విషం పెట్టి హత్య చేశారని, వృద్ధురాలిని దారుణంగా చంపారని వైద్యులు వెల్లడించారు. వృద్ధురాలిని బలంగా కొట్టి, ఊపిరి ఆడకుండా చేసి చంపారని వారు తెలిపారు.
నలుగురి కడుపులో విషపు ఆనవాళ్లు గుర్తించామని చెప్పారు. లభించిన ఆధారాలను బట్టి వీరి కుటుంబంలోని కొందరు మోక్షం కోసం ఈ పని చేసినట్టు తెలుస్తోంది. విషయం బయటకు చెబుతుందేమోనన్న భయంతోనే వృద్ధురాలిని హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులంతా రాజస్థాన్ లోని చిత్తోర్ గఢ్ కు చెందిన వారని, వారి బంధువులకు సమాచారం ఇచ్చామని పోలీసులు తెలిపారు.