కాంగ్రెస్ సెంటిమెంట్’ను టార్గెట్ చేసిన టీఆర్ఎస్

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారిపోతున్నాయి. వివిధ పార్టీలు ప్ర‌జ‌ల్లోకి వెళ్లి క్యాపెయినింగ్ కూడా ప్రారంభించాయి. టీఆర్ఎస్ ను గ‌ద్దె దించాల‌నే ఏకైక ల‌క్ష్యంతో విప‌క్ష కాంగ్రెస్ పావులు కదుపుతుంటే, ప్ర‌తిప‌క్షాల‌ను ప్ర‌జ‌ల్లో మ‌రింత ప‌లుచ‌న చేసే ప్లాన్ తో అధికార టీఆర్ఎస్ ముందుకు వెళుతోంది. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలే విప‌క్షాల‌ను విప‌క్షాలు అస్త్రాలుగా చేసుకోవ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మే. ఉద్య‌మ పార్టీగా తెలంగాణ‌లో టీఆర్ఎస్ కు ఎంత ఆద‌ర‌ణ ఉందో అంతే స్థాయిలో కాంగ్రెస్ పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త లేద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది. అదీగాక 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల‌కు రాబోయేఎన్నిక‌ల‌కు చాలా వ్య‌త్యాసం ఉంది. తెలంగాణ ప్ర‌క‌ట‌న త‌రువాతే 2014 ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్ప‌టికీ రాష్ట్ర అవ‌త‌ర‌ణ తేదీని అప్ప‌టికీ ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. ఒక ర‌కంగా ఉమ్మ‌డి రాష్ట్రంలో ఎన్నిక‌లుగానే భావించి తెలంగాణ ప్ర‌జ‌లు స్పందించారు. కాంగ్రెస్ పై వ్య‌తిరేక‌త లేక‌పోయినా స‌మైక్య పాల‌న‌పై వ్య‌తిరేక‌త వెల్లువెత్త‌డ‌మే అప్ప‌ట్లో కాంగ్రెస్ ఓట‌మికి కార‌ణ‌మైంది.

అదంతా గ‌తం.. తెలంగాణ సాధించిన పార్టీగా టీఆర్ఎస్ కు ఎంత క్రెడిట్ ద‌క్కిందో, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పై కూడా సెంటిమెంట్ ఉంది ప్ర‌జ‌ల్లో. సోనియా తెలంగాణ ఇచ్చింద‌న్న గౌర‌వమూ కొంత ఎక్కడో ఓ మూల‌న ప్ర‌జ‌ల్లో నెల‌కొంది. స‌రిగ్గా ఈ సెంటిమెంట్ నే ఇప్పుడు టీఆర్ఎస్ టార్గెట్ చేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తెలంగాణ ఏర్పాటు విష‌యంలో కొద్దో గొప్పో ప్ర‌జ‌ల్లో ఉన్ సెంటిమెంట్ ను తొల‌గించేందుకు అధికార పార్టీ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకెళుతోంది. తెలంగాణ ద్రోహిగా ముద్ర‌వేసే ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది టీఆర్ఎస్. ఇదులో భాగంగానే మంత్రి కేటీఆర్ సోనియా పై ఘాటు వ్యాఖ్య‌లు చేశార‌నేది విశ్లేష‌కుల అంచ‌నా.

సోనియాపై విమ‌ర్శ‌ల‌తో టీఆర్ఎస్ ఊహించిన‌ట్లుగానే కాంగ్రెస్ నుంచి స్పంద‌న ల‌భించింది. సోనియాను విమ‌ర్శించ‌డంపై టీఆర్ఎస్ పై భ‌గ్గు మ‌న్నాయి కాంగ్రెస్ వ‌ర్గాలు. మాట మాట పెరుగుతూ స‌వాల్ లు, ప్ర‌తి స‌వాళ్లు విసురుకునే స్థాయికి చేరుకుంది. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై ఛాలెంజ్ చేసుకునే బ‌దులుగా తెలంగాణ సెంటిమెంట్ , సోనియాపై విమ‌ర్శ‌ల‌పై స‌వాల్ విసురుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. టీఆర్ఎస్ ఊహించిన‌ట్లుగానే ప్ర‌స్తుతం రాజ‌కీయ ప‌రిణామాలు జ‌రుగుతున్నాయి. కాంగ్రెస్ కు కోపం వ‌చ్చేలా సోనియాపై విమ‌ర్శ‌లు చేసి ప‌క్క‌దారి ప‌ట్టించ‌డంలో టీఆర్ఎస్ పార్టీ స‌ఫ‌ల‌మైంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌వ‌ర్శ‌లు ఇంకా ఎక్క‌డిదాకా వెళ‌తాయో, కాంగ్రెస్ సెంటిమెంట్ పై టీఆర్ఎస్ టార్గెట్ ఏ మేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి మ‌రి.