అలవాటులో పొరపాటుగా… !!
నాగం జనార్దన్ రెడ్డి పార్టీ మారినా కాంగ్రెస్ లో చేరిన విషయమే మరిచిపోయినట్టున్నారు. బీజేపీలో ఉన్నప్పుడు అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీని విమర్శించిన నాగం ఇంకా అలవాటులో పొరపాటుగా టపీమనీ కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారు. అదేంటి కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ ను విమర్శించడమేంటని అందరూ అనుకున్నా అది నిజమే . అయితే అది ఉద్దేశ పూర్వకంగా జరిగింది మాత్రం కాదు. పొరపాటుగా ఫ్లో లో వచ్చింది మాత్రమే.
ఇరిగేషన్ మంత్రి పెద్ద యూజ్ లెస్ ఫెల్లో అంటూ మంత్రి హరీష్ పై విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్, హరీష్ రావు అవినీతి బయటపెడుతానంటూ ఆయన హెచ్చరించారు. కాళేశ్వరం పేరుతో బాంబే తమాషా చూపిస్తున్నారని, ఆర్టీఐలో సమాచారం అడిగితే ఎందుకు ఇవ్వడంలేదని ఆయన ప్రశ్నించారు. అలా ఫ్లోలో మాట్లాడుతూ కాంగ్రెస్ అవినీతే అభివృద్ధికి అడ్డంకి అంటూ మాట్లాడారు నాగం. అలవాటులో పొరపాటుగా మాట్లాడారో లేక ఫ్లోలో వచ్చేసిందోగానీ నాగం వ్యాఖ్యలతో అంతా ఖంగు తిన్నారు. విషయాన్ని గమనించిన నాగం వెంటనే సర్థుకుని టీఆర్ఎస్ అవినీతే అభివృద్ధికి అడ్డంకి అంటూ విమర్శించారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరినా నాగం ఇంకా అలవాటు పోలేదేమో అంటూ అక్కడున్న వారంతా అనుకుంటున్నారు.