‘హాల్’ లోకి ‘వాల్’ వచ్చింది

మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ద్రావిడ్‌కు చోటు దక్కింది. ఈ విషయాన్ని తెలుపుతూ.. ఐసీసీ ట్వీట్ చేసింది. క్రికెట్ దేవుడు సచిన్ ఓ ఫన్నీ ట్వీట్ తో తన సహచరుడిని అభినందించారు. “ద్రావిడ్ కు శుభాకాంక్షలు.. ఎట్టకేలకు ‘హాల్’లో ‘వాల్’కు చోటు లభించింది. ఈ గౌరవానికి రాహుల్ పూర్తిగా అర్హుడు” అంటూ ట్విట్ చేశాడు సచిన్. ఇప్పుడీ ‘హాల్-వాల్’ వైరల్ అవుతోంది.

ఓ వైపు వరుసగా వికెట్లు పడిపోతున్నా, మరోవైపు గోడ మాదిరి నిలబడి, అవుట్ కాకుండా ఆడే ద్రావిడ్ ను అభిమానులు ముద్దుగా ‘ది వాల్’ పిలుచుకుంటారన్న సంగతి తెలిసిందే. టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన నాలుగ‌వ‌ క్రికెటర్‌గా రాహుల్‌కు గుర్తింపు ఉంది. ద్రావిడ్ తన కెరీర్‌లో మొత్తం 164 టెస్టులు, 344 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో అతను 13వేల 288, వన్డేల్లో 10 వేల 889 రన్స్ చేశాడు. ప్రస్తుతం రాహుల్ అండర్-19 ఇండియన్ టీమ్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.