ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అర్హులే

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(బీఈడీ) అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఇకపై బీఈడీ అభ్యర్థులు కూడా ఎస్జీటీ పోస్టులకు అర్హులే. గతంలో బీఈడీ చేసినవారు కేవలం పాఠశాల సహాయకులు(ఎస్‌ఏ) పోస్టులకు మాత్రమే అర్హులుగా ఉండేవారు. ఇప్పుడు వీరికి ఎస్జీటీ పోస్టులకు అవకాశం కల్పిస్తూ సవరించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్‌సీటీఈ) విడుదల చేసింది.

ఐతే, ఎస్జీటీ పోస్టుకు ఎంపికైన బీఈడీ అభ్యర్థులు రెండేళ్లలోపు ఎన్‌సీటీఈ గుర్తింపు పొందిన ప్రాథమిక విద్యలో ఆరునెలల బ్రిడ్జ్‌ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. 2008 డీఎస్సీ సమయంలో 30% ఎస్జీటీ పోస్టులను డీఈడీ చేసినవారికే కేటాయించారు. మిగతా 70శాతం పోస్టులను డీఈడీ, బీఈడీ చేసినవారికి మెరిట్‌ ప్రాతిపదికన ఇచ్చారు. 2010లో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 2012 డీఎస్సీ నుంచి ఎస్జీటీ పోస్టులను వందశాతం డీఈడీ చేసినవారితోనే భర్తీ చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో డీఎస్సీలోనూ ఎస్జీటీ పోస్టులను డీఈడీవారితోనే భర్తీ చేశారు.

ఈ సవరణ బీఈడీ అభ్యర్థులకు ఎంతో మేలు చేయనుంది. ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఈనెల 6న నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. 10,351 ఖాళీలు ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ పోస్టుల భర్తీ బీఈడీవారికి వరంగా మారనుంది. ఎస్టీటీ పోస్టులు 4,967 వరకు ఉన్నాయి. వీటికి బీఈడీవారు పోటీ పడనున్నారు.