వాట్సాప్‌’కు కేంద్రం వార్నింగ్

హద్దుల్లేని సోషల్ మీడియా కారణంగా కొన్ని అనర్థాలకు కారణమవుతోంది. ఇప్పుడిదే విషయంపై కేంద్రం సీరియస్ గా ఆలోచిస్తోంది. సోషల్ మీడియాని నియత్రించగలమా ? అనే ఆలోచన కూడా చేస్తుంది. తాజాగా, ప్రముఖ సోషల్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌పై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. వాట్సాప్‌లో అసత్య వార్తలు ప్రచారం కావడం వల్ల పలువురు అమాయకులపై కొందరు దాడులకు దిగుతున్నారని.. అటువంటి తప్పుడు సందేశాలు వైరల్‌ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కేంద్రం వాట్సాప్‌ను హెచ్చరించింది.

మహారాష్ట్రలోని ధులే జిల్లాలో చిన్నారులను అపహరించుకుపోయే గ్యాంగ్‌ తిరుగుతుందని వాట్సాప్‌లో సందేశం వైరల్‌గా మారింది. దీంతో ఆ ప్రాంతంలో తిరుగుతున్న ఐదుగురు వ్యక్తులను పిల్లలను అపహరించుకుపోయే వారిగా భావించి అక్కడి గ్రామస్థులు వారిని కొట్టి చంపారు. ఇటువంటి నకిలీ వార్తలు ప్రజల్లోకి వెళ్లడం వల్ల శాంతి, భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. రెచ్చగొట్టే సందేశాలు, అబద్దపు వార్తలు వాట్సాప్‌లో వైరల్‌ కాకుండా చూడాలని ఐటీ శాఖ వెల్లడించింది.