ఏపీలో అలా…! తెలంగాణలో ఇలా…!!
రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రల్లో విభిన్న రాజకీయ పరిస్థితులు ఏర్పడ్డాయి.. రెండు తెలుగు రాష్ట్రల్లో ప్రాంతీయ పార్టీలు మరింత బలపడటంతో పాటు జాతీయ పార్టీలు ప్రజాదరణ కోల్పోయాయి. అందులోనూ ఏపీలో రాజకీయ పరిస్థితులు ప్రత్యేకం. ప్రస్తుతం అటు ఏపీలో, ఇటు తెలంగాణలో రాజకీయ పరిస్థితులను పోల్చి చూస్తే చాలా తేడా కనిపిస్తోంది. రెండూ తెలుగు రాష్ట్రలే అయినప్పటికీ ప్రాతాల వారీగా విభిన్న రాజకీయ పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పవచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ విషయాలను గమనిస్తే ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. ఇక ఎన్నికల సమయంలోనూ బీజేపీతో బాహాటంగా పొత్తు పెట్టుకునే పరిస్థితి మాత్రం ఇప్పట్లో కనిపించడంలేదు. వైసీపీ అధినేత జగన్ కూడా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. జాతీయ పార్టీల కంటే ఎక్కువగా అధికార టీడీపీని టార్గెట్ చేస్తూ ముందుకు వెళుతున్నారు. మరో వైపు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఏపీలో టీడీపీని అధికారం దక్కకూడదంటూ బాహాటంగానే ప్రకటిస్తూ ప్రజల్లో తిరుగుతున్నారు. ఇక కాంగ్రెస్ తన ఉనికిని కాపాడుకునే పరిస్థితిలో ఉంది. వచ్చే ఎన్నికల్లో జాతీయ పార్టీలను నమ్మి వారికి రాష్ట్రంలో అధికారం కట్టబెట్టేందుకు మాత్రం ఏపీలో ప్రజలు సిద్ధంగా లేరు. ఇక మూడు ప్రాంతీయ పార్టీల మధ్యే ఎన్నికల వార్ జరగనుంది. ఏపీలో పూర్తిగా ప్రాంతీయ పార్టీల మధ్యే పోటీ ఉండనుంది. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఎవరి వ్యూహాలతో వారు ప్రజల్లోకి వెళుతున్నారు. అయితే ఈ మూడు ప్రాంతీయ పార్టీల మధ్య గట్టి పోటీనే ఉండనుందనేది రాజకీయ విశ్లేషకులు చెబుతన్న మాట.
ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ ఉద్యమ పార్టీగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు గట్టి పోటీనిచ్చే ప్రాంతీయ పార్టీలే లేవని చెప్పాలి. కొత్తగా కోదండరాం జనసమితి పార్టీ ఏర్పాటు చేసినా పార్టీ ఇంకా సంస్థాగత నిర్మాణం పూర్తి కాలేదు. కాబట్టి ఇప్పటికైతే తెలంగాణలో వన్ అండ్ ఓన్లీ ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ మాత్రమే. ఇక తెలంగాణ ఇచ్చిన పార్టీగా జాతీయ పార్టీ కాంగ్రెస్ కు తెలంగాణలో కొంత ఆదరణ ఉన్నమాట నిజం. ప్రభుత్వ వైఫల్యాలపై కలిసికట్టుగా కృషిచేస్తే కాంగ్రెస్ అదికారంలోకి వచ్చే అవకాశమూ లేకపోలేదు. వైసీపీ, జనసేన, టీడీపీ పార్టీలు ప్రాంతీయ పార్టీలే అయినా పార్టీ అధినేతలు ఏపీకి చెందిన వారవడం, ఏపీలోనే ఎక్కువ దృష్టిపెట్టడం, తెలంగాణలో పార్టీలకు నాయకత్వ లేమి వెరసీ ఈ మూడు పార్టీలు టీఆర్ఎస్ కు గట్టిపోటీనిచ్చే పరిస్థితిలో లేవనే చెప్పాలి. మొత్తంగా తెలంగాణలో జాతీయ పార్టీ కాంగ్రెస్ కు, టీఆర్ఎస్ కు మధ్య గట్టి పోటీ ఉంటుందనేది విశ్లేషకుల అంచనా. మరో జాతీయ పార్టీ బీజేపీ ప్రభావం కూడా కొంత ఉండే అవకాశమూ లేకపోలేదు. ఓవరాల్ గా ఏపీలో ప్రాంతీయ పార్టీల మధ్య, తెలంగాణలో ప్రాంతీయ , జాతీయ పార్టీల మధ్య ఎన్నికల యుద్ధం జరగనుందనేది స్పష్టమవుతోంది. రెండూ తెలుగు రాష్ట్రలే అయినా రెండుచోట్లా విభిన్న రాజకీయ పరిస్థితులు ఏర్పడ్డాయనేది నిజం.