కాళేశ్వ‌రంపై సుప్రీంను ఆశ్ర‌యించిన రిటైర్డ్ ఇంజ‌నీర్..!

కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్ధ్యం అవసరానికి మించి ఉందని, రీడిజైన్ పేరుతో ప్ర‌భుత్వం ప్రజాధనం వృధా చేస్తోంద‌ని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రిటైర్డ్ ఇంజ‌నీర్ దొంతుల లక్ష్మీనారాయణ. కాళేశ్వరాన్ని పర్యాటక ప్రాంతంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని ఆయ‌న పేర్కొన్నారు. 19 రిజర్వాయర్ల నిర్మాణంతో నీటి అవసరాలకు మించి అదనపు సామర్ధ్యంతో ప్రాజెక్టు నిర్మిస్తున్నారని, నిల్వ సామర్థ్యం 144 టీఎంసీలు అని చెబుతూ.. మొదటి పంటకు 170 టీఎంసీల నీరు ఇస్తామంటూ ప్రభుత్వం పొంతన లేని లెక్కలు చెబుతోందని పిటిష‌న్ లో పేర్కొన్నారు.

మొదటి పంటకు 66 టీఎంసీ లు సరిపోతాయని, ఎత్తిపోతల అంటే అధిక వ్యయంతో కూడుకున్నద‌ని, అనాలోచితంగా ప్రభుత్వం కమీషన్లు, కాంట్రాక్టుల కోసం రీడిజైన్ చేశారని సుప్రీంకు పిటిష‌న్ లో విన్న‌వించారాయ‌న‌. విద్యుత్ కూడా ఏడాదికి 1100 మెగావాట్లు అదనంగా కావాల్సి ఉంటుంద‌ని, ఆ భారం కూడా ప్రజలపైనే పడుతుందని పేర్కొన్నారు. 50 వేల కోట్ల రూపాయల నిర్మాణం వ్యయంతో పూర్త‌య్యే ప్రాజెక్టును రిడిజైన్ పేరుతో 90 వేల కోట్ల రూపాయలకు తీసుకొచ్చారుని ఫిర్యాదు చేశారు. అనవసరంగా ప్రజలను నిర్వాసితులుగా చేస్తున్నారంటూ సుప్రీం కు ఇచ్చిన పిటిష‌న్ లో పేర్కొన్నారు.