తన కోసం ఆ పని చేయొద్దని చెప్పిన ఏపీ డీజీపీ..!
డీజీపీ వస్తున్నాడంటే చాలు ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిపి వేస్తుంటారు పోలీసులు. ఆయన వాహనం వెళ్లే వరకు ఏ వాహనాన్ని వదిలిపెట్టరు కూడా. ఉన్నతస్థాయిలో ఉన్న ఏ పోలీసు అధికారైనా సరే ఈ ఫార్మాలిటీస్ ను కాదనలేరు. అయితే కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఫార్మాలిటీస్ ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.
గురువారం ఉదయం డీజీపీ వస్తున్నారని తెలుసుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. డీజీపీ గన్నవరం నుంచి విజయవాడకు వస్తుండగా ట్రాఫిక్ నిలిపివేశారు. విషయం తెలుసుకున్న డీజీపీ ఠాకూర్ తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపవద్దని అధికారులను ఆదేశించారు.తన కోసం ట్రాఫిక్‌ను నిలిపి, ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు కూడా డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఇదే విషయాన్ని తెలియజేశారు. డీజీపీ మాటలు ఆదేశాలు విని షాకవడం పోలీసుల వంతైంది..