ఫన్ మొదలైంది.. !

టాలీవుడ్ లో మల్టీస్టారర్ ట్రెండు ఊపందుకొంది. ఇప్పటికే శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగ్-నానిల మల్టీస్టారర్ సెట్స్ మీదకెళ్లింది. జెడ్ స్వీడుతో షూటింగ్ జరుపుకుంటోంది. మహేష్ 25లో కామెడీ హీరో అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా తొలి షెడ్యూల్ డెహ్రాడూన్ లో కొనసాగుతోంది. తాజాగా, అనిల్ రాఘవపూడి దర్శకత్వంలో రానున్న వెంకీ-వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ ‘ఎఫ్2’ మొదలైంది. ఈ విషయాన్ని తెలుపుతూ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ట్విట్ చేశారు. లుంగ్ కట్టుకొని చిత్రబృందంతో కలిసి దిగిన ఫోటో ఒకటి పోస్ట్ చేశారు.

‘ఎఫ్ 2’ టైటిల్ కు ‘ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ అనేది ట్యాగ్ లైన్. ఇద్దరు హీరోల్లో ఒకరు ఫన్, మరొకరు ప్రస్టేషన్ ని చూపించబోతున్నారు. ప్రేక్షకుల అంచనా మేరకు వెంకీ ఫన్ ని పంచబోతున్నాడు. వరుణ్ తేజ్ ప్రస్టేషన్ ని చూపించబోతున్నాడు. వీరిద్దరు సినిమాలో తోడల్లుళ్లుగా కనిపించబోతున్నారు. వెంకటేశ్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ నటించనున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ సినిమాలతో హ్యాట్రిక్ అందుకొన్నాడు దర్శకుడు అనిల్ రాఘవపూడి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఎఫ్2’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే వెంకీ, వరుణ్ లని పాత్రలని అద్భుతంగా చూపించే పనిలో అనిల్ ఉన్నట్టు సమాచారమ్.