కుప్ప‌కూలిన చారిత్ర‌క బ‌స్టాండ్..! త‌ప్పిన పెను ప్ర‌మాదం..!!

ఉమ్మడి రాష్ట్రాల తొలి బస్‌స్టేషన్‌‌గా పేరుగడించిన హైద‌రాబాద్ గౌలిగూడలోని పాత సీబీఎస్ బ‌స్టాండ్ కుప్ప‌కూలింది. రాష్ట్ర నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల ప్రయాణికులు కూడా ఈ బస్టాండ్ నుంచే రాకపోకలు సాగించే వారు.
88 సంవత్సరాలుగా సీబీఎస్‌ బస్టాండ్ ప్రజలకు ఎంతో సేవలందించిన ఈ బస్టాండ్‌లో మొత్తం 36 ఫ్లాట్‌ఫాంలను ఉండేవి. 8దశాబ్దాల చరిత్ర ఉన్న షెడ్ శిథిలావస్థకు చేరుకోవడంతో అక్కడి నుంచి ఎలాంటి రాకపోకలు జరపకుండా ఖాళీ ఉంచారు. ఆ తరువాత బస్సుల అవసరాల కోసం పాతబస్టాండ్‌కు మరమత్తులు చేసి సిటీ బస్సులకు అనుమతినిచ్చారు.

అయితే నాలుగు రోజుల క్రితం బస్టాండ్ పూర్తి శిథిలావస్థకు చేరుకుందని ఏ క్షణమైనా కుప్పకూలే ప్రమాదం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో సిటీ బస్సులను, ప్రయాణికులను అందులోకి అనుమతించలేదు. ఆర్టీసీ అధికారులు ఊహించిన విధంగానే షెడ్ పూర్తిగా కుప్పకూలిపోయింది. భారీ శబ్ధంతో కుప్పకూలడంతో అక్కడున్న ప్రజలు ఆందోళనకు గురయ్యారు. లోపల ఎవరూ లేకపోవడంతో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. పురాతనమైన షెడ్ కుప్పకూలిన విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడకు వెళుతున్నారు. ముంద‌స్తుగా జాగ్ర‌త్త‌లు పాటించ‌డం వ‌ల్లే పెను ప్ర‌మాదం త‌ప్పిన‌ట్ల‌యింది..