కౌన్సిలర్ కూతురుకి ఎమ్మెల్యే వార్నింగ్..!?
బెల్లంపల్లి మున్సిపాలిటీలో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. విపక్ష క్యాంపులను విచ్ఛిన్నం చేయడానికి అధికార పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం సామ,దాన, దండోపాయాలను ఉపయోగిస్తున్నారట. స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కౌన్సిలర్ కూతరుతో మాట్లాడిన ఒక ఆడియో తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆడియో లో సంభాషణ వైరల్ అవుతోంది.. మా చేతిలో ప్రభుత్వం ఉంది, మేము తలచుకుంటే ఏమైనా చేస్తామంటూ ఎమ్మెల్యే కౌన్సిలర్ కూతురుతో మాట్లాడటం విమర్శలకు తావిస్తోంది. ముందుగా ప్రేమతో చెప్పి చూస్తున్నామని, వినకపోతే ఏం చేయాలో తమకు తెలుసంటూ ఎమ్మెల్యే మాట్లాడారు. విపక్ష క్యాంపు నుంచి బయటకు రాకపోతే భూముల లిటిగేషన్ బయటకు తీస్తానంటూ ఎమ్మెల్యే బెదిదించడం ఇప్పుడు వివాదంగా మారింది.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆడియో అధికార పార్టీకి కొత్త చిక్కులను తెచ్చిపెడుతోంది.