జీవన్ రెడ్డి vs కొప్పుల ఈశ్వర్..
జగిత్యాలలో అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాతోంది. రెండో విడత గొర్రెల పంపణీలో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డికి , టీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ ఒకరికొకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. గొర్రెల పంపిణీలో ప్రభుత్వ తీరుపై జీవన్ రెడ్డి ప్రజలకు వివరించే ప్రయత్నం చేసారు. ఒక్కో గొర్రె యూనిట్ పై 40వేల నష్టం జరుగుతోందని, బయట రాష్ట్రల నుంచి కొంటే ఒక్కో గొర్రెకు రెండు వేలు అదనంగా ఖర్చవుతుందని అన్నారు జీవన్ రెడ్డి. మౌలిక సదుపాయాలు లేక లబ్ధిదారులు గొర్రెలు అమ్ముకుంటున్నారని, ప్రజల సొమ్మును ప్రభుత్వం వృథా చేస్తోందని ఆయన అన్నారు. ఈ విషయంలో సోషల్ ఆడిట్ నిర్వహించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
సోషల్ ఆడిట్ నిర్వహిస్తే గొల్ల కుర్మలు జైలుకు వెళ్తారని, జీవన్ రెడ్డి కోరుకునేది ఇదేనా అని కొప్పుల ప్రశ్నించారు. ప్రతిపక్షాల మాటలు గొల్లకుర్మలు నమ్మొద్దని అన్నారు కొప్పుల. గొర్రెలు, దాణా, షెడ్లు, డాక్టర్ అన్ని వసతులు కల్పిస్తున్నామని, ఇంకేం కావాలంటూ కొప్పుల ప్రశ్నించారు. మంచి పథకాన్ని స్వాగతించాలని కోరారు కొప్పుల. మొత్తం మీద రెండో విడత గొర్రెల పంపిణీలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది.