అమెరికా దుండగుల కాల్పుల్లో వరంగల్ విద్యార్థి మృతి
అమెరికాలో దుండగుల కాల్పులకు మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. కన్సాస్ నగరంలో ఒక రెస్టారెంటులో శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు ఐదు రౌండ్లు కాల్పులు జరపడంతో వరంగల్‌కు చెందిన శరత్ కొప్పుల (26) తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే పోలీసులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. శరత్ ఆరు నెలల క్రితం మిస్సోరి విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లాడు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం శుక్రవారం సాయంత్రం 7 గంటలకు హోటల్‌లోని క్యాష్‌కౌంటర్‌లో శరత్ విధుల్లో ఉన్నాడు. గుర్తుతెలియని ఓ వ్యక్తి వచ్చి ఆహారం తీసుకున్నాడు. బిల్లు 30 డాలర్లు అయిందని చెప్పగా, వెంటనే తుపాకీ తీసి శరత్‌ను కాల్చినట్లు తెలిసింది. శరత్ పై కాల్పులు జరిగిపింది ఓ నల్ల జాతీయుడని తెలుస్తోంది. హత్యకు ముందు సీసీ కెమెరాలో ఓ నల్లజాతి యువకుడు తిరుగుతున్న పుటేష్ ని అమెరికా అధికారులు విడుదల చేశారు.
శరత్ స్వస్థలం వరంగల్ నగరంలోని కరీమాబాద్. తండ్రి రామ్మోహన్ హైదరాబాద్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగి. తల్లి మాలతి వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలో పంచాయతీరాజ్ శాఖలో ఈవోఆర్డీగా పనిచేస్తున్నారు. రామ్మోహన్ కుటుంబంతో హైదరాబాద్ అమీర్‌పేటలోని ధరంకరం రోడ్డులో నివసిస్తున్నారు. శరత్ మృతదేహం ఇండియాకు తీసుకొచ్చేందుకు నాలుగైదు రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు.