లోకేష్ రాష్ట్ర పర్యటన ఖరారు
తెలుగుదేశం పార్టీ యువనేత, మంత్రి నారా లోకేశ్ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు నిర్ణయం తీసుకొన్నారు. ఇకపై వారంలో మూడు రోజులు అధికారిక కార్యక్రమాలు, మరో మూడు రోజులు పర్యటనలు చేయాలని భావిస్తున్నారు. తద్వారా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.
లోకేష్ రాష్ట్ర పర్యటనతో ఏపీలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. ఇన్నాళ్లు ప్రతిపక్ష నాయుడు వైఎస్ జగన్ ప్రత్యర్థిగా చంద్రబాబుని భావించేవారు. ఇప్పుడు ఆయన స్థానంలో తనయుడు లోకేష్ వచ్చినట్టు కనబడుతోంది. వచ్చే ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక కూడా లోకేష్ చేతుల మీదుగానే నడవనుంది. ఇప్పటికే ఆయన కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులని ప్రకటించేశారు. ఇదీగాక, వచ్చే ఎన్నికల్లో మరోసారి టీడీపీ విజయం సాధిస్తే.. లోకేష్ ని ముఖ్యమంత్రి చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ పొలిటికల్ గేమ్ జగన్ వర్సెస్ లోకేష్ లా మారనుందని చెప్పుకొంటున్నారు.