డీఎస్ కాంగ్రెస్ లోకి వస్తే ఒప్పుకునేది లేదు..!!
టీఆర్ఎస్ నేత డి.శ్రీనివాస్ వ్యవహారంపై ఆ పార్టీనేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీ కవితకు ఫిర్యాదు చేయడమే కాకుండా, నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులంతా కలిసి సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే డీఎస్ కాంగ్రెస్ లోకి వెళతారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన అనుచరులతో రహస్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఒకవేళ ఆయన టీఆర్ఎస్ ను వీడినా కాంగ్రెస్ లో చేర్చుకోవడానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ బాహాటంగానే డీఎస్ రాకను వ్యతిరేకిస్తున్నారు. డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ కి అన్యాయం చేసి టీఆర్ఎస్ లో చేరాడని, టీఆర్ఎస్ లో డీఎస్ ను పక్కన పెట్టారని కాంగ్రెస్ లోకి వస్తానంటే తాము ఒప్పుకోమన్నారు. డీఎస్ ను మళ్ళీ కేసీఆర్ పిలిచి శీనన్న అంటే చాలు కే.సీ.ఆర్.కి భజన చేస్తాడని వీహెచ్ విమర్శించారు. డీఎస్ ని పార్టీ లోకి తీసుకోవాలో వద్దో అని ఒక్కసారి కమిటీ నేతలు ఆలోచన చెయ్యాలని సూచించారు.అంజన్ కుమార్ యాదవ్ కమిటీలు వేసే ముందు నగర నాయకులని సంప్రదిస్తే బాగుంటుందని చురకలు వేశారు.