హమ్మయ్యా.. ‘2.O’ రిలీజ్ డేటు వచ్చేసింది !

శంకర్ దర్శకత్వంలో ‘రోబో’ సీక్వెల్ గా రోబో ‘2.O’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, అక్షయ్ కుమార్ విలన్ గా కనిపించబోతున్నారు. ఎమీ జాక్సన్ హీరోయిన్. ఈ సినిమా రిలీజ్ డేటు ఎప్పుడు అన్న అయోమయ పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. సినిమా ఎఫ్ఎక్స్ ప‌నులు పూర్తికాకపోవడం, అవి ఎప్పుడు పూర్తవుతాయన్నది తెలియకపోవడంతో… చిత్రబృందం రిలీజ్ డేటుని ప్రకటించలేకపోయింది.

ఇప్పుడా అడ్డంకులు అన్ని తొలగిపోయాయి. నవంబర్ 29న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రోడక‌్షన్స్‌ అధికారికంగా ప్రకటించింది.ఈ సినిమా గ్రాఫిక్ వర్క్స్ ని అమెరికాకు చెందిన ఓ సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ కాస్త దివాళా తీసింది. దీంతో అమెరికాలోని మరో సంస్థ, జపాన్ లోని ఓ గ్రాఫిక్స్ వర్క్స్ కంపెనీకి పనిని అప్పగించింది. ఇప్పుడీ కంపెనీ వీఎఫ్‌ఎక్స్‌ పనులని పూర్తి చేసింది. త్వరలోనే వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ డెలివరీ చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో సినిమా విడుదల తేదిని చిత్రబృందం ఖరారు చేసింది.

దాదాపు రూ. 400కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇటీవల వీఎఫ్ఎక్స్ ప‌నులు ఆలస్యం కావడంతో మరో రూ. 100కోట్లు ఖర్చు పెరిగినట్టు సమాచారమ్. దీంతో ఈ సినిమా బడ్జెట్ రూ. 500కోట్లు దాటిందని చెబుతున్నారు. ఇక, రజనీ నుంచి వచ్చిన కబాలి, కాలా ప్రేక్షకులని పెద్దగా మెప్పించలేకపోయాయి. దీంతో.. రజనీ అభిమానులు రోబో 2.ఓ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు